రసవత్తరంగా ప్రాదేశిక ఎన్నికలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:44 PM
శ్రీశైల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన ప్రాదేశిక ఎన్నికలు ఒక్క మండలం మినహా మిగతా మూడు మండలాల్లో రసరత్తరం కానున్నాయి.
వెలుగోడు మండలంలో ఫలించిన రాజీ మంత్రం
మూడు మండలాల్లో పోటాపోటీ
ఆత్మకూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీశైల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన ప్రాదేశిక ఎన్నికలు ఒక్క మండలం మినహా మిగతా మూడు మండలాల్లో రసరత్తరం కానున్నాయి. ఆత్మకూరు మున్సిపాలిటీ తరహాలోనే అన్ని మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవాలవుతాయని అందరూ భావించినప్పటికీ అందరి అంచనాలను తారుమారు చేసేలా మూడు మండలాల్లో కూటమి, వైసీపీలు పోటీగా నిలిచారు. ప్రత్యేకించి వెలుగోడు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీ 6, వైసీపీ 5, బీజేపీ 1, జనసేన 1, ఎస్డీపీఐ 1 చొప్పున ఏకగ్రీవాలు చేసుకున్నారు. అదేక్రమంలో జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి గుండం రమణారెడ్డి దక్కించుకున్నారు. ఈయన మిడ్తూరు మండలానికి చెందినప్పటికీ జడ్పీ చైర్మన్ రేసులో ఉండటం వల్ల ఆయన జనరల్ స్థానమైన వెలుగోడు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి ఏకగీవ్రంగా గెలుపొందారు. ఆత్మకూరు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో మాత్రం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి, వైసీపీలు పోటీ పడ్డాయి. మూడు మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఆత్మకూరు మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలు, బండి ఆత్మకూరు మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, మహానంది మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ తరుపున అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అక్కడక్కడ జనసేన, బీజేపీలకు ఒక్కొ స్థానాన్ని కేటాయించి మిగతా స్థానాన్ని టీడీపీ అభ్యర్థులే బరిలో నిలిచారు. మరికొన్ని చోట్ల ఇంటిపెండెట్లు కూడా పోటీలో ఉన్నారు. కాగా ఆత్మకూరు మండలంలోని కృష్ణాపురం ఎంపీటీసీ స్థానంలో బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకురాలు మోమిన్ షబాన మద్దతుతో శ్రీనివాసులు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దతుతో సోంపల్లి పురుషోత్తం అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరికి సోంపల్లి పురుషోత్తంకే బీ-ఫారం వచ్చింది. దీంతో ఆయనే పార్టీ తరుపున పోటీలో నిలిచారు. బీ-ఫారం విషయంలో బీజేపీలో సరైన సమన్వయం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ టీడీపీ అభ్యర్థి బరిలో నిలవాల్సి వచ్చింది. ఈ మూడు మండలాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది వేచిచూడాల్సిందే మరీ.