Share News

రెడ్‌ స్మగ్లర్‌ ముజామిల్‌ అరెస్టు

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:49 AM

ఎర్ర చందనం స్మగ్లర్లు, వారి వెనుక ఉన్న సూత్రధారుల ఆట కట్టించేందుకు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్‌ఫోర్స్‌) వేట మొదలు పెట్టింది.

రెడ్‌ స్మగ్లర్‌ ముజామిల్‌ అరెస్టు

  • ఎర్రచందనం అక్రమ రవాణాలో కింగ్‌పిన్‌

  • తిరుపతి వద్ద పట్టుకున్న టాస్క్‌ఫోర్సు

  • టీమ్‌ను అభినందించిన పవన్‌ కల్యాణ్‌

తిరుపతి(కపిలతీర్థం), అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఎర్ర చందనం స్మగ్లర్లు, వారి వెనుక ఉన్న సూత్రధారుల ఆట కట్టించేందుకు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్‌ఫోర్స్‌) వేట మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్‌ మొహమ్మద్‌ ముజామిల్‌ను అరెస్టు చేసింది. శనివారం ఉదయం చిత్తూరు-నాయుడుపేట జాతీయ రహదారిపై అడిషనల్‌ ఎస్పీ కులశేఖర్‌ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ బృందం ముజామిల్‌ను పట్టుకుంది. ముజామిల్‌కు చైనాలోని జైమెన్‌ టాంగాంగ్‌ ఫాంగ్‌ ట్రేడ్‌ కంపెనీతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ఎర్రచందనం దుంగలను లైసెన్స్‌ పేరు చెప్పి, అక్రమంగా చైనా తరలించేవాడు. శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా రవాణా చేసే వాడు. ముజామిల్‌పై అనేక కేసులున్నాయి. అత్యధిక కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. దాంతో తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందని, సూత్రధారులు లొంగిపోవాలని ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఈ నేపధ్యంలోనే ముజామిల్‌ పట్టుబడ్డాడు. ఆ వివరాలను టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్‌, ఏఎస్పీ కులశేఖర్‌తో కలిసి ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు తెలిపారు. ‘‘పొలాల్లో పెరిగే ఎర్రచందనం కొనేందుకు ఉన్న లైసెన్సును అడ్డం పెట్టుకుని చైనా దేశానికి భారీఎత్తున ఎగుమతి చేస్తూ ముజామిల్‌ రూ.కోట్లు సంపాదించాడు. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసుల్లో అతడు ముద్దాయి. గత ఏడాది టాస్క్‌ఫోర్సు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది.


పక్కా ప్రణాళికతో ముజామిల్‌ను తిరుపతి సమీపంలోని తనపల్లి క్రాస్‌వద్ద అరెస్టు చేశాం. కర్ణాటకకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు సయ్యద్‌ అబ్దుల్‌, లతీఫ్‌ అలియాస్‌ సెట్టు, సేటుబాయ్‌, వాజీబ్‌లతో కలసి ఏపీ నుంచి ఎర్రచందనం అక్రమంగా తరలించడమే కాకుండా బెంగళూరుకు చెందిన రవి అనేవ్యక్తి ద్వారా రైతుల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేశాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ముజామిల్‌కు సహకరిస్తున్న చైనాకు చెందిన గ్జియామెన్‌ ట్యాంగాంగ్పంగ్‌ ట్రేడ్‌ కో లిమిటెడ్‌ అనే కంపెనీకి చెందిన జోజో, మనదేశంలో అక్రమ రవాణాకు సహకరిస్తున్న మైఖేల్‌ పాత్రలపై లోతైన దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిలువరించడానికి టాస్క్‌ఫోర్సు త్రిముఖ చర్యలు అమలు చేస్తోందన్నారు. ఫలితంగా గతేడాది జనవరి నుంచి 27కేసుల్లో 87శాతం ముద్దాయిలపై నేరం రుజువై శిక్షలు పడ్డాయని సుబ్బరాయుడు చెప్పారు. కాగా, ముజామిల్‌ ఆట కట్టించిన ఆపరేషన్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్‌ ఎస్పీ కులశేఖర్‌, సిబ్బందిని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు.

Updated Date - Feb 01 , 2026 | 04:50 AM