తిరుమలలో రథసప్తమి రికార్డ్
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:54 AM
ఎన్నడూలేని విధంగా ఈసారి రథసప్తమి రోజున తిరుమల మాడవీధుల్లో వాహనసేవలను రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వీక్షించారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
సమష్టి కృషితో వేడుకలు విజయవంతం: టీటీడీ ఈవో
9 ప్రశ్నలతో భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ
ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ 97 శాతం మంది ప్రశంస
తిరుమల, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఎన్నడూలేని విధంగా ఈసారి రథసప్తమి రోజున తిరుమల మాడవీధుల్లో వాహనసేవలను రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వీక్షించారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. రథసప్తమి నిర్వహణపై మంగళవారం మధ్యాహ్నం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో అన్ని విభాగాల సమన్వయంతో సఫలీకృతమయ్యామని చెప్పారు. రథసప్తమి వేడుకలు విజయవంతం కావడానికి కృషి చేసిన టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఆర్టీసీ, శ్రీవారి సేవకులు, అర్చకస్వాములు, వాహన బేరర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈసారి రథసప్తమికి భారీగా భక్తులు తిరుమలకు వచ్చారని.. గరుడ సేవను 1.80 లక్షల మంది వీక్షించినట్టు ఏఐ కెమెరాల ద్వారా గుర్తించామని తెలిపారు. ఇదే మాడవీధుల గ్యాలరీల అసలైన సామర్థ్యంగా చెప్పుకోవచ్చన్నారు. 24వ తేదీ నుంచి 25వ తేదీ రాత్రి వరకు టీటీడీ సౌకర్యాలను వినియోగించుకుంటూ భక్తులెవరూ కదలకుండా ఒకే ప్రాంతంలో ఓపిగ్గా కూర్చుని వాహనసేవలను వీక్షించారని ఈవో వెల్లడించారు. ఇక, రికార్డుస్థాయిలో ఆ రోజు 14,339 వాహనాలు తిరుమలకు వచ్చాయన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 3,364 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బంది సేవలందించారని తెలిపారు. తిరుమలకు 60,425 మంది, తిరుపతికి 82,241 మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించారన్నారు.
అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా అధికారులు, సిబ్బంది సహకారంతో ఉత్సవాన్ని విజయవంతం చేశామన్నారు. భవిష్యత్తులో రాంభగీచ వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు రూపొందించుకుంటామని తెలిపారు. భక్తుల నుంచి వాట్సాప్, ఐవీఆర్‌ఎస్, శ్రీవారిసేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ చేశామని చెప్పారు. 97 శాతం మంది భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని కొందరు సూచించారని, అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామన్నారు. మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం అంశంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏర్పాట్లు అద్భుతం
తిరుమలలో ఈ నెల 25న జరిగిన రథసప్తమి ఏర్పాట్లపై 97 శాతం మంది భక్తులు సంతప్తి వ్యక్తం చేశారు. ముఖ్య పర్వదినాల్లో ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మార్పుచేర్పులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ఆనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 25న నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో కూర్చుని ఉన్న భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వాట్సాప్, ఐవీఆర్‌ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా 9 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. దీని ప్రకారం 97 శాతం మంది భక్తులు టీటీడీ కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2ు మంది పర్వాలేదని సమాధానం ఇవ్వగా ఒక శాతం మంది ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.