Jeevan Daan: 301 మందికి జీవన్‘దాన్’
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:16 AM
జీవన్‌దాన్ గడచిన ఏడాది (2025) వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది.
2025లో రికార్డు స్థాయిలో బాధితులకు అవయవాల దానం
బ్రెయిన్ డెడ్ అయిన 93 మంది నుంచి సేకరణ
విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘జీవన్‌దాన్’ గడచిన ఏడాది (2025) వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్‌డెడ్ అయిన 93 మంది నుంచి సేకరించిన అవయవాలను 301 మంది బాధితులకు అందించారు. అంతకుముందు 2024లో 200 మందికి అందించగా, గత ఏడాది అదనంగా 101 మందికి అందించారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక ఆర్గాన్స్‌ను సేకరించిన రికార్డును జీవన్‌దాన్ సృష్టించినట్టు అయింది. జీవన్‌దాన్ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ బ్రెయిన్ డెడ్ అయిన 403 మంది నుంచి వివిధ రకాల అవయవాలను సేకరించి 1,293 మందికి అమర్చారు. గడచిన రెండేళ్లుగా అవయవదానంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో బ్రెయిన్‌డెడ్ అయిన వారి అవయవాలు (ఆర్గాన్స్) దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. అవయవదానం చేసే వ్యక్తికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం కూడా అందిస్తున్నారు. పది వేల రూపాయలతోపాటు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తోంది. ఈ గౌరవం కూడా మరింత మందిని ముందుకు వచ్చేలా చేస్తోంది.
అవగాహనతో మంచి ఫలితాలు
ఎంతోమంది అవయవాలు ఫెయిలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని వందల మంది వివిధ రకాల అవయవాల కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ర్టేషన్ చేయించుకుని ఉన్నారు. అటువంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన కల్పిస్తున్నాం. ఇది మంచి ఫలితాన్ని అందించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకువస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అవయవాలను సేకరించి బాధితులకు అందించాం. జీవన్‌దాన్ కార్యక్రమాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ సోషల్ అభినందించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరింతమంది అవయవదానానికి ముందుకువచ్చేలా కృషిచేస్తాం.
-డాక్టర్ కె.రాంబాబు, జీవన్‌దాన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్