Share News

మార్కుల రికార్డులు!

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:00 AM

ఒకప్పుడు పదో తరగతి పరీక్షల్లో పాసైతే చాలు అనుకునేవారు. ఆ తర్వాత ఫస్ట్‌ క్లాస్‌ వస్తే గొప్పగా భావించేవారు. రానురాను మార్కులు 90శాతం... 95శాతం వరకూ చేరాయి.

మార్కుల రికార్డులు!

  • టెన్త్‌, ఇంటర్‌లో గరిష్ఠ మార్కుల జోష్‌

  • గత ఏడాది టెన్త్‌లో ఏకంగా 600

  • ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌లో 469

  • భాషా సబ్జెక్టుల్లోనూ వంద శాతం

  • విద్యార్థుల్లో పెరుగుతున్న పఠనాసక్తి

  • మారిన విద్యావిధానమే కారణం

  • పరీక్షల వేళ క్షణం తీరిక లేని వైనం

  • మానసిక స్థితీ ముఖ్యమే: నిపుణులు

  • కొత్తగా కొట్టాల్సిందేం లేదు...

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు పదో తరగతి పరీక్షల్లో పాసైతే చాలు అనుకునేవారు. ఆ తర్వాత ఫస్ట్‌ క్లాస్‌ వస్తే గొప్పగా భావించేవారు. రానురాను మార్కులు 90శాతం... 95శాతం వరకూ చేరాయి. ఇక ఇప్పుడు దాదాపుగా నూరు శాతం మార్కులు సాధించే స్థాయికి పిల్లలు చేరుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మారిన విద్యా విధానమే దీనికి దోహద పడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు గతంలో ఒక పాఠశాలలో టాపర్‌కు 500 మార్కులు దాటితే ఆ తర్వాత సంవత్సరం విద్యార్థులకు దానిని మించి మార్కులు రావాలనే టార్గెట్‌ టీచర్లు పెట్టేవారు. అలా ఏటా విద్యార్థులకు కొత్త టార్గెట్‌ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కువ మంది విద్యార్థులు ఆ విధంగా లక్ష్యాలు పెట్టుకుని సాధించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. 90శాతం మార్కులు వచ్చిన వారు.. మరిన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఫస్ట్‌ క్లాస్‌ సాధించిన వారిలో 70-80శాతం మార్కులకు మించి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాస్‌ మార్కులు సాధించే విద్యార్థులు మరిన్ని మార్కులు కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాఠశాల, ఇంటర్మీడియట్‌ స్థాయిలో విద్యార్థులకు మార్కుల వరద పారుతోంది.


పదో తరగతిలో 600

పదో తరగతి పరీక్షలు 600 మార్కులకు జరుగుతాయి. 590 మార్కులు దాటి అనేక మంది విద్యార్థులకు మార్కులు వచ్చేవి. కాగా గతేడాది పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థినికి ఏకంగా 600 మార్కులు వచ్చాయి. 590 మార్కులు దాటిన విద్యార్థులు అనేకమంది ఉన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఎంపీసీలో ఫస్టియర్‌ విద్యార్థికి 470కు గాను 469 వచ్చాయి. అనేక మందికి 465 దాటాయి. స్టేట్‌ టాపర్‌కు మొత్తం మార్కుల్లో కేవలం ఒక్కటే తగ్గింది. వచ్చే ఏడాది ఫస్టియర్‌ చదివే విద్యార్థులకు 470 మార్కులు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇక సెకెండియర్‌ ఎంపీసీ టాపర్‌కు 994 వచ్చాయి. నూరుశాతం మార్కులకు ఆరే తగ్గాయి. బైపీసీలో మాత్రం ఫస్టియర్‌ 453 వద్ద ఆగింది. వీరు కూడా నూరుశాతం మార్కులకు కృషి చేస్తున్నారు.


ఒత్తిడి ప్రభావం?

నూటికి 99, 100శాతం మార్కులు సాధించడం అంటే పాఠ్యపుస్తకాలను దాదాపుగా క్షుణ్ణంగా చదివినట్లుగానే భావించాలి. ఆవిధంగా కార్పొరేట్‌ విద్యా సంస్థలు విద్యార్థులను మార్కుల యంత్రాలుగా మార్చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థలైతే ఉదయం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు విద్యార్థులను చదివిస్తున్నాయి. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చివరికి పరీక్షల రోజుల్లో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లే అవకాశం తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా ఆయా విద్యా సంస్థలే సొంత బస్సుల్లో తీసుకెళ్తున్నాయి. పరీక్ష ముగియగానే తీసుకొచ్చి తర్వాత పరీక్షకు సన్నద్ధత మొదలు పెట్టిస్తున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు కూడా ప్రైవేటు దారి పడుతున్నాయి. మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. పరీక్షలు సమీపించే కొద్దీ విద్యార్థులకు రోజూ స్లిప్‌టెస్ట్‌లు, మోడల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ టాప్‌ మార్కులు భారీగా పెరిగాయి.


రాత కాదు.. సబ్జెక్టే ముఖ్యం!

ఒకప్పుడు గణితం, సైన్స్‌లాంటి సబ్జెక్టుల్లో నూరుశాతం మార్కులు వేసినా భాషా సబ్జెక్టుల్లో ఒకట్రెండు మార్కులు తగ్గేవి. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కడో చిన్న స్పెల్లింగ్‌ పొరపాటు కనిపించినా ఆ మేరకు ఒకటో అరో మార్కు తగ్గించేవారు. కానీ, ఇప్పుడు భాషా సబ్జెక్టుల్లోనూ విద్యార్థులు నూరు శాతం మార్కులు సాధించేస్తున్నారు. గతంలో చేతిరాతను కూడా టీచర్లు ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పుడు చేతిరాత ఎలా ఉన్నా.. సబ్జెక్టుపై పట్టు ఉందని భావిస్తే.. మార్కులు వేస్తుండడం విద్యార్థులకు కలిసి వస్తోంది. ఇదంతా మారిన విద్యావిధానానికి అద్దం పడుతోంది.

Updated Date - Apr 20 , 2026 | 04:00 AM