Share News

AP CM Chandrababu: రియల్‌ గేమ్‌ మొదలైంది

ABN , Publish Date - Jan 13 , 2026 | 04:46 AM

రాష్ట్రంలో వ్యవస్థ బాగానే ఉందని, నిర్వహణలోనే సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

AP CM Chandrababu: రియల్‌ గేమ్‌ మొదలైంది

  • మారాలని చెబుతున్నా.. ఒత్తిడి చేస్తున్నా..

  • మారకపోతే ప్రజలే ఆ పని చేస్తారు

  • మార్చి 15 నాటికి సీఎస్ఎస్‌ నిధులు వాడాలి

  • కార్యదర్శులు, కలెక్టర్లకు సీఎం డెడ్‌లైన్‌

అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వ్యవస్థ బాగానే ఉందని, నిర్వహణలోనే సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో; వర్చువల్‌ విధానంలో కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. జవాబుదారీతనానికి సంబంధించిన రియల్‌ గేమ్‌ ఇప్పుడు ప్రారంభమయిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అధికారులు తమ తీరు మార్చుకోవాలి. మీరేం చేయాలో నేను చెబుతున్నాను. ఒత్తిడి చేస్తున్నాను. ఇంకా మీలో మార్పు రాకపోతే ప్రజలతో ఒత్తిడి చేయించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్‌) నిధులను ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీ వెల్ఫేర్‌, మున్సిపల్‌, ఆరోగ్యశాఖతో పాటు పలు శాఖలు సీఎ్‌సఎస్‌ నిధులను సక్రమంగా ఉపయోగించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఒకవైపు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే, కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు చేయడానికి ఏమిటీ సమస్య? సీఎ్‌సఎస్‌ నిధులు ఖర్చు చేయాల్సిన బాధ్యత కార్యదర్శులు, కలెక్టర్లదే. ఈ ఏడాది మార్చి 15 నాటికి ఈ నిధులు మొత్తం ఖర్చు చేయాల్సిందే’’నంటూ మరోసారి ఆయన డెడ్‌లైన్‌ విధించారు. సీఎస్ఎస్‌ నిధులు వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. ‘‘మొక్కుబడిగా నేను సమీక్షలు చేయడం లేదు. ప్రభుత్వ లక్ష్యాలను సిద్ధం చేస్తున్నాం. ఏవో కారణాలు చెప్పి తప్పించుకోవాలనుకుంటే కుదరదు. మీ కార్యాలయాల్లో హ్యాపీగా కూర్చొని పని చేస్తామంటే ఇక కుదరదు. కేంద్ర నిధుల కోసం ప్రతి ఒక్కరూ ఢిల్లీకి వెళ్లాల్సిందే. రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. సీఎస్ఎస్‌ నిధులు మొత్తం వాడేయాలి.


వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నాటికి నిధులు ఎవరైతే వాడలేదో వారి వద్ద నుంచి వ్యక్తిగత వివరణ తీసుకుంటా. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టాల్సి వస్తుంది’’ అని సీఎం హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.29.29 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ.4.85 లక్షలకు చేరేలా లక్ష్యాలు నిర్ణయించామని సీఎం తెలిపారు. వ్యవసాయంలో 13.43 శాతం, పారిశ్రామిక రంగంలో 17.23 శాతం, సేవా రంగంలో 16.46 శాతం, నికర పన్నుల్లో 14.2 శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి సాధించేందుకు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 17.11 శాతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని, దానికి అనుగుణంగా పనిచేయాలన్నారు.

ఆర్టీజీఎస్‌ సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి

అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌కు సూచించారు. అమరావతి సచివాలయంలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్లు, కార్యదర్శుల సమీక్షా సమావేశంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సేవలపై సీఎం సమీక్షించారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తరహాలో ప్రాజెక్టును తయారు చేయమని చెప్పడం లేదని.. డేటాను ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఆర్‌టీజీఎస్‌ పనితీరు బాగున్నా.. దానిపై ప్రచారం చేయలేకపోతున్నారని అధికారులను ఉద్దేశించి అన్నారు. ఈ నెల 15 నాటికి పోలీసు శాఖ కూడా ఆన్‌లైన్‌లోనే పౌర సేవలను అందించాలని ఆదేశించారు.

Updated Date - Jan 13 , 2026 | 04:48 AM