గోల్డ్ లోన్‌కు ఆంక్షల తాళం
ABN , Publish Date - May 14 , 2026 | 05:18 AM
మన వద్ద బంగారం ఉందని సులువుగా లోన్ తెచ్చుకుని అవసరాలు తీర్చుకుందామంటే ఇకపై కుదరదు. ఎందుకంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విధించిన ఆంక్షలు అంత కఠినంగా ఉన్నాయి.
బ్యాంకుల్లో కష్టతరంగా బంగారం రుణాలు
సామాన్య ప్రజలకు గోల్డ్ లోన్ కష్టమే..
2.50 లక్షల పైబడితే ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
ఆభరణాలకే రుణాలు.. బిస్కెట్లకు నో
ముందు జాగ్రత్త చర్య అంటున్న బ్యాంకర్లు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి): మన వద్ద బంగారం ఉందని సులువుగా లోన్ తెచ్చుకుని అవసరాలు తీర్చుకుందామంటే ఇకపై కుదరదు. ఎందుకంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విధించిన ఆంక్షలు అంత కఠినంగా ఉన్నాయి. విజయవాడ రీజియన్ పరిధిలో పలు బ్యాంకులు ఆ ఆంక్షలను అమల్లోకి తీసుకు వచ్చాయి. కొత్త నిబంధనలతో బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకోవడం కష్టసాఽధ్యమేనని మధ్య తరగతి వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల మేరకు పట్టణ ప్రాంతాల్లో ఇకపై రూ. 2.50 లక్షల పైన గోల్డ్ లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే రుణం మంజూరు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, వ్యవసాయానుబంధ పరిశ్రమలు ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే రుణాలు ఇస్తారు. ఈ నిబంధనలు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ‘పిన్నకిల్’ సాఫ్ట్‌వేర్ ఉపయోగించే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), ఐసీఐసీఐ, డీబీఎస్ వంటి బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. మిగిలిన బ్యాంకులు సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సి ఉండటంతో కొద్ది రోజుల పాటు మాత్రమే పాత విధానాన్ని అనుసరిస్తున్నాయి. మరో పక్షం రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఇదే బాటలో నడవనున్నాయి.
వాస్తవ ఆదాయం మేరకే రుణం
బంగారం తనఖా రుణాలకు ఐటీ రిటర్న్స్‌ను తప్పనిసరి చేయటంతో పాటు బంగారం విలువలో ఎంత రుణం ఇవ్వాలో కూడా నిర్దేశించారు. రూ. 2.5 లక్షల లోపు రుణం తీసుకోవాలంటే.. బంగారం విలువలో 85 శాతం వరకు ఇస్తారు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అయితే బంగారం విలువలో 80 శాతం ఇస్తారు. రూ. 5 లక్షలపైన రుణాలు అయితే బంగారం విలువలో గరిష్ఠంగా 75 శాతం మాత్రమే రుణం ఇస్తారు. ఇక రూ. 2.50 లక్షల పైబడి రుణం కావాలంటే ఖాతాదారుడి ఆదాయం, అప్పులు అన్నీ బ్యాంకర్లకు తెలపాల్సి ఉంటుంది. ఖాతాదారుడికి ఉన్న ఇతర రుణాలు, ఈఎంఐలు వంటివి కూడా లెక్కించి అతని వాస్తవాదాయాన్ని బేరీజు వేసి ఎంత అయితే రుణం ఇస్తే తిరిగి చెల్లించగలరో అంత మొత్తానికే బంగారం తీసుకుని రుణం మంజూరు చేస్తారు. అంతేకాకుండా ఏ క్వాలిటీ బంగారంపై ఎంత రుణం ఇవ్వాలో కూడా ఆర్బీఐ నిర్దేశించింది. 18 నుంచి 22 క్యారెట్ల హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు, నాణేలపై మాత్రమే రుణాలు ఇస్తారు. బిస్కెట్లు, ముడి బంగారం వంటి ప్రైమరీ గోల్డ్‌పై రుణాలు ఇవ్వవు. బంగారం విలువను లెక్కించేటపుడు 22 క్యారెట్ల ధరనే ప్రామాణికంగా తీసుకుని కచ్చితమైన విలువను నిర్ణయిస్తారు. బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే డబ్బుతో తిరిగి బంగారు ఆభరణాలు, నాణేలు కొనడానికి లేదు.
మధ్య తరగతి వర్గాలపై ప్రభావం
తాజా ఆంక్షలు, నిబంధనల కారణంగా మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడే అవశాశం ఉంది. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది బంగారాన్ని కొంటారు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇతర భవిష్య అవసరాల కోసం బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే.. ఇకపై మధ్యతరగతి ప్రజలకు అంత సులువుకాదు. సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఐటీ రిటర్న్స్ వేసే పరిస్థితి ఉండదు. ఐటీ రిటర్న్స్ లేకపోతే బ్యాంకులు రూ. 2.5 లక్షలు దాటి రుణం ఇచ్చే పరిస్థితీ లేదు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్నా, వ్యా పార అవసరం, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు ఎక్కువ మంది బంగారం రుణాలపై ఆధారపడుతున్నారు. ఆర్బీఐ కొత్త నిబంధనలు సామాన్యులను తీవ్రంగాఇబ్బంది పెట్టనున్నాయి.
ప్రైవేట్ సంస్థలను కట్టడి చేయగలరా?
ఆర్బీఐ నిబంధనలు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకూ వర్తిస్తాయి. బ్యాంకులు, గోల్డ్ లోన్ కంపెనీల మధ్య వ్యత్యాసం లేకుండా నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. కానీ, బ్యాం కులను పర్యవేక్షించినట్టుగా ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలను పర్యవేక్షించే పరిస్థితి ఎంత వరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే. తమ వ్యాపారాలను పెంచుకోవటానికి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు షార్ట్‌కట్ విధానాలను అవలంభిస్తే.. ప్రజలు వాటి చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ కచ్చితంగా ఉపయోగించుకుంటాయి. ఒక రకంగా ఆర్బీఐ ఆంక్షలు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల మేలు చేస్తాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్ వర్గాల వాదన మాత్రం మరోలా ఉం ది. గత ఐదారేళ్లుగా బంగారం మీద రుణాలు విపరీతంగా పెరిగిపోయాయని, రుణాల లక్ష్యాన్ని కూడా దాటిపోతున్నాయని చెబుతున్నారు. డెత్ క్లోజర్స్ కారణంగా ఇలాంటి నిబంధనలు విధించి ఉండొచ్చంటున్నారు. బంగారం ధరలూ ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఆకస్మాత్తుగా ధరలు పడిపోతే బ్యాంకులు దివాళా తీసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ముందస్తు జాగ్రత్త చర్యలు అని చెబుతున్నారు.