Share News

మా కష్టాన్ని రాజకీయం చేయొద్దు!

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:11 AM

రాయలసీమలో కరుడు గట్టిన ఫ్యాక్షన్‌ గ్రామం మాది. ఐదు దశాబ్దాలకు పైగా ముఠా గొడవలతో ఎంతో నష్టపోయాం. టీటీసీ, బీఈడీ చదివినా ఉద్యోగాలు రాక కూలీలుగా....

మా కష్టాన్ని రాజకీయం చేయొద్దు!

  • శ్రమకోర్చి టీచర్‌ ఉద్యోగాలు సాధించాం

  • ఫ్యాక్షన్‌ గ్రామం కప్పట్రాళ్ల నుంచి టీచర్లుగా ఎంపికైన ఏడుగురు అభ్యర్థులు

కర్నూలు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమలో కరుడు గట్టిన ఫ్యాక్షన్‌ గ్రామం మాది. ఐదు దశాబ్దాలకు పైగా ముఠా గొడవలతో ఎంతో నష్టపోయాం. టీటీసీ, బీఈడీ చదివినా ఉద్యోగాలు రాక కూలీలుగా జీవనం సాగిస్తున్న మా జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపింది. మెగా డీఎస్సీలో మా గ్రామం నుంచి ఏడుగురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యాం’ అని మెగా డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన కర్నూలు జిల్లా కప్పట్రాళ్లకు చెందిన యువత తెలిపారు. ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు నవ ఉపాధ్యాయులు చింతమాను శ్రీరాములు, రాజేశ్వరి, ఎన్‌.రామాంజనేయులు, రామానాయుడు, ఈ.ఉత్తేజ్‌గౌడు, మర్యాద రామన్న, మల్లేశ్‌ గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘కష్టపడి చదువుకుని డీఎస్సీ రాశాం. ఒక్క మా గ్రామం నుంచే ఏడుగురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యాం. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వలేదు. ఆ పరిస్థితి కూడా రాలేదు’ అని స్పష్టం చేశారు. ప్రతిభకు రాజకీయ రంగును పులమడం సరైంది కాదని హితవు పలికారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మెగా డీఎస్సీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగాలు సాధించిన వారి కష్టాన్ని తక్కువ చేసి చూపించడం వారి శ్రమను అవమానించినట్లే అన్నారు. విజయం సాధించిన ప్రతి అభ్యర్థి వెనుక ఎన్నో త్యాగాలు, నిద్రలేని రాత్రులు, ఆశలు ఉంటాయని, వాటిని గౌరవించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 05:11 AM