Share News

సీమ సిగన ఉద్యాన సిరి

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:36 AM

ఉద్యానవన రంగంలో రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను 2026-27 సాధారణ బడ్జెట్‌ నుంచే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు.

సీమ సిగన ఉద్యాన సిరి

  • ప్రపంచ ఉద్యానవన హబ్‌గా కొత్త రూపు

  • భారీ ప్రణాళికతో సిద్ధమవుతున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయింపు

  • ప్రైవేటు రంగం నుంచీ ఆర్థిక మద్దతు.. మొత్తం పెట్టుబడుల లక్ష్యం రూ.లక్ష కోట్లు

  • సమగ్ర అభివృద్ధితో రెట్టింపు కానున్న రైతుల ఆదాయం

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యానవన రంగంలో రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను 2026-27 సాధారణ బడ్జెట్‌ నుంచే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతితోపాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలుపుకొని మొత్తం పది జిల్లాల్లో అమలు చేయనున్న ఈ ప్రణాళికతో రాయలసీమ ప్రాంతం ఉద్యానవన పంటల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుంది. ప్రస్తుతం రాయలసీమలో నీటి కొరత, బలహీనమైన మార్కెట్‌ వ్యవస్థ, రవాణా సౌకర్యాల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని మొత్తం ఉద్యానవన సాగు విస్తీర్ణంలో 43 శాతం వాటాను, ఉత్పత్తిలో 55 శాతం వాటాను కలిగి ఉంది. దాదాపు 65 రకాల అధిక విలువైన ఉద్యానవన పంటలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈ రంగం ప్రస్తుతం ఏడాదికి రూ.81,734 కోట్ల స్థూల విలువను (సంప్రదాయ వ్యవసాయం కంటే నాలుగు రెట్లు అధికం) అందిస్తున్నప్పటికీ, పంట కోత అనంతర నష్టాలు, మార్కెట్ల కొరత, మౌలిక సదుపాయాల లోపాల కారణంగా రైతులకు తగిన ధర లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ‘వికసిత్‌ భారత్‌ 2047’, రాష్ట్ర ప్రభుత్వ ‘స్వర్ణ ఆంధ్ర 2047’ లక్ష్యాలకు అనుగుణంగా రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం, రాయలసీమను అధిక విలువ, ఎగుమతి ఆధారిత ఉద్యానవన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ కేంద్రంగా మార్చడం.


ప్రస్తుతం సీమలో సాగు విస్తీర్ణం 8.4 లక్షల హెక్టార్లు ఉండగా, 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఉత్పత్తి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీమను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేసేందుకు మూడు కీలక రంగాలపై సుమారు రూ.41వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రూ.30వేల కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లోనే కేటాయించారు. అదనంగా, ప్రైవేటు రంగం నుంచి (రైతులు, పారిశ్రామికవేత్తలు, లాజిస్టిక్స్‌ సంస్థలు) మరో రూ.59వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మొత్తం మీద రానున్న ఏడాది, రెండేళ్లలో సుమారు లక్ష కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. ప్రభుత్వం దృష్టి సారించిన మూడు ప్రధాన రంగాలివీ..


నీటిపారుదల రంగం..

నీటి పారుదల రంగంలో సుమారు రూ.20వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. అధిక విలువ పంటలకు సాగునీటి సుస్ధిరత కల్పించడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా కొత్తగా తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు ప్రస్తుతం సాగులో ఉన్న 3.6 లక్షల ఎకరాలకు సాగునీటి వ్యవస్థను పటిష్ఠం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వెలిగొండ, గాలేరు - నగరి సాగునీటి పథకం, హంద్రీ- నీవా సాగునీటి పథకం, పేరూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం, శ్రీ బాలాజీ రిజర్వాయర్‌ వంటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు చెరువుల పునరుద్ధరణ, సూక్ష్మ నీటి పారుదల (మైక్రో ఇరిగేషన్‌) విస్తరణ ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంచనున్నారు.

అధిక విలువ కల్పించడం.

ఉద్యానవన పంటలకు అధిక విలువ కల్పించే కార్యక్రమం కోసం సుమారు రూ.15వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. 200కి పైగా క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్‌ను మెరుగుపర్చనున్నారు. ఆధునిక నర్సరీల ఏర్పాటు, కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటివి చేస్తారు. ఆరు లక్షల హెక్టార్లలో సూక్ష్మ నీటి పారుదల, మూడు లక్షల హెక్టార్లలో ఉన్న తోటల పునరుజ్జీవం ద్వారా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెడుతున్నారు. తద్వారా అరటి, మామిడి, దానిమ్మ, మొసంబి, టమాటా, మిర్చి వంటి పంటలను ప్రపంచ స్థాయి నాణ్యతతో ఎగుమతులకు సిద్ధం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.


గ్రామీణ రోడ్లను మెరుగుపర్చడం...

గ్రామీణ రోడ్లను మెరుగుపర్చేందుకు సుమారు రూ. ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఉత్పత్తి కేంద్రాలను మార్కెట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఓడరేవులు, విమానాశ్రయాలతో అనుసంధానించేందుకు 7,326 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను మెరుగుపర్చడం, పునర్నిర్మించడం చేస్తారు. దీనివల్ల రవాణా సమయం, ఖర్చు తగ్గి, పాడైపోయే పంటలను త్వరగా మార్కెట్లకు చేర్చడం సులభతరం అవుతుంది.

ఆర్థిక సామాజిక ప్రభావం

భారీ పెట్టుబడుల వల్ల రాయలసీమ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక ప్రభావం ఎంతో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం 4.4 లక్షల మందికిపైగా రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారు. ఉద్యానవన రంగం నుంచి ఏటా రూ.24వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం వస్తుంది. పంట దిగుబడిలో సుమారు 10 శాతం మెరుగుదల, పంటకోత అనంతర నష్టాల నుంచి ఏటా 12 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల పంటను కాపాడటం జరుగుతుంది.

Updated Date - Feb 15 , 2026 | 03:36 AM