Share News

హార్టీకల్చర్‌ హబ్‌గా రాయలసీమ

ABN , Publish Date - May 20 , 2026 | 05:05 AM

రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ‘రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)’ అమలుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హార్టీకల్చర్‌ హబ్‌గా రాయలసీమ

  • రూ.లక్ష కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధి

  • ప్రస్తుతం 8.41లక్షల హెక్టార్లలో సాగు

  • 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యం

  • ఈ ప్రాజెక్టుతో 9లక్షల ఉద్యోగాల కల్పన

  • రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక అమలుకు ఉత్తర్వులు జారీ

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ‘రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)’ అమలుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.లక్ష కోట్లతో రాయలసీమను ప్రపంచ పోటీతత్వ కేంద్రంగా మార్చేందుకు ఉద్ధేశించిన సమగ్ర ప్రణాళికను కాల పరిమితితో అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల అభివృద్ధి, నీటి భద్రత, రహదారుల అనుసంధానం, విలువ గొలుసు పోటీతత్వాన్ని సమన్వయం చేయడం ద్వారా రాయలసీమలో పండ్ల ఉత్పత్తుల నాణ్యత, ఎగుమతుల్లో పోటీతత్వం పెంచడం ద్వారా ఉద్యాన రైతుల ఆదాయాలు పెంచాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.లక్ష కోట్ల ప్రణాళికలో రూ.40వేల కోట్లు ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్‌ పెట్టుబడుల ద్వారా రూ.60వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తంలో ఉద్యాన వనాలకు రూ.14,906కోట్లు, నీటిపారుదల సదుపాయాలకు రూ.20,884 కోట్లు, గ్రామీణ రహదార్ల అభివృద్ధి పనులకు రూ.4,562కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం రాయలసీమలో 8.41లక్షల హెక్టార్లలో 222 లక్షల టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తులు వస్తుండగా, దీన్ని 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లి, 435 లక్షల టన్నుల ఉత్పత్తులు సాధించాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 9లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని అధికారులు నివేదించారు. నీటి పారుదల, మౌలిక వసతులు, శుద్ధి పరిశ్రమలు, ఎగుమతి వ్యవస్థలను ఏకీకృతం చేయడం ద్వారా కరువు పీడిత రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్రానికి స్థిరమైన వ్యవసాయ వృద్ధి చోదకంగా మార్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకాశం, మార్కాపురం సహా, రాయలసీమ జిల్లాల్లోని 303 మండలాల్లో 5,869 గ్రామాల్లో, 201 క్లస్టర్లలో మామిడి,తీపినారింజ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి, ఆపిల్‌, అవకాడో, అంజూర, మిరియాలు వంటి ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచడం ఈ ప్రణాళికలో కీలకం. పంట కోత అనంతర సౌకర్యాలు, కోల్డ్‌ చైన్‌లు, గిడ్డంగుల అభివృద్ధిలో బహుళ జాతి కంపెనీల భాగస్వామ్యంతో మూడు దశల్లో ఈ ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2026 | 05:05 AM