Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకు

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:24 AM

రాయలసీమవాసుల చిరకాల వాంఛ స్టీల్‌ ప్లాంటు నిర్మాణం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2007లో కడప జిల్లాలో స్టీలు ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. అప్పటినుంచీ ప్లాంటు నిర్మాణం..

ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • నెరవేరనున్న సీమవాసుల ఉక్కు కల

  • కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం

  • ఎల్లుండి పనులను ప్రారంభించనున్న సీఎం

  • 2028 డిసెంబరు నాటికి తొలిదశ పూర్తి

  • వైఎస్‌ హయాంలో తొలిసారి శంకుస్థాపన

  • 2సార్లు టెంకాయ కొట్టినా పూర్తి చేయని జగన్‌

  • కూటమి రాకతో వేగంగా తిరిగి గాడిలోకి..

(కడప-ఆంధ్రజ్యోతి)

రాయలసీమవాసుల చిరకాల వాంఛ స్టీల్‌ ప్లాంటు నిర్మాణం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2007లో కడప జిల్లాలో స్టీలు ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. అప్పటినుంచీ ప్లాంటు నిర్మాణం శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టడం వరకే పరిమితమైంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పం, పక్కా ప్రణాళికతో స్టీలుప్లాంటు వేగంగా గాడిలో పడింది. అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మొదటి దశను 2028కి పూర్తిచేసేలా ముందుకు పోతున్నారు. ఇందులోభాగంగా వచ్చే నెల మూడోతేదీన కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ‘జేఎ్‌సడబ్ల్యూ రాయలసీమ స్టీల్‌ లిమిటెడ్‌’ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.16,350 కోట్ల పెట్టుబడితో స్టీలుప్లాంటు నిర్మాణానికి జిందాల్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. ప్లాంటును రెండు దశల్లో నిర్మాణం పూర్తిచేసి, సుమారు 2,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నారు. మొదటి దశలో రూ.4,500 కోట్ల వ్యయంతో ఏడాదికి మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా స్టీలుప్లాంటును పూర్తిచేయనున్నారు. ఇక రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడితో నిర్మాణం చేపట్టి, పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టీలుప్లాంట్‌ కోసం ప్రభుత్వం 3271.1 ఎకరాలు కేటాయించింది. ఇందులో 1100 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌, 171.1 ఎకరాల్లో సిబ్బందికి క్వార్టర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన రెండు వేల ఎకరాలలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది.


2028 నాటికి పూర్తి..

కడప స్టీలుప్లాంటు నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. స్టీల్‌ ప్లాంటుకు ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేసినా, పూర్తి చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపఽథ్యంలో జిందాల్‌ చేపడుతున్న స్టీలు ప్లాంటు మొదటి దశను ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. జగన్‌ హయాంలో జిందాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పనులు చేపట్టలేదు. చంద్రబాబు సర్కారు మరలా సంస్థను మార్చకుండా జిందాల్‌తోనే ప్లాంటు ఏర్పాటుచేసే విధంగా చర్చలు జరిపింది.

ఇక ఉక్కు..సీమ

రాష్ట్ర విభజన చట్టం 2014లోని 13వ షెడ్యూలులో కడపలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలో స్టీలు ప్లాంటు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత కేంద్రంం కడప జిల్లాలో స్టీలుప్లాంటు నిర్మాణానికి ఫీజుబిలిటీ లేదని పక్కనపెట్టేసింది. 2018లో స్టీలుప్లాంటు కోసం ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ నిరాహార దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 2018 డిసెంబరు 27న రాయలసీమ స్టీలు కార్పొరేషన్‌ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారు. స్టీలుప్లాంటుకు 3,295 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌.. 2019 డిసెంబరు 27న జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె మధ్య స్టీలు ప్లాంటు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ‘‘ఎన్నికలకు 6నెలల ముందు టెంకాయ కొడితే మోసం. ఎన్నికలు అయిన 6నెలలకు శంకుస్థాపన చేస్తే అది చిత్తశుద్ధి’’ అంటూ అప్పట్లో జగన్‌ పెద్ద డైలాగులే చెప్పారు. అవి విని, మూడేళ్లలో స్టీలుప్లాంటు పూర్తవుతుందని, ఉద్యోగాలు వస్తాయని జనం సంబరపడ్డారు. తన హయాంలో స్టీలుప్లాంటు నిర్మాణానికి రెండోసారి కూడా కొబ్బరికాయ కొట్టారే కానీ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండానే జగన్‌ దిగిపోయారు. తిరిగి చంద్రబాబు రాగానే.. ఉక్కు సీమగా రాయలసీమను మలిచే బృహత్తర కార్యాచరణ ఎట్టకేలకు శ్రీకారం చుట్టుకుంది.

Updated Date - Jul 01 , 2026 | 05:26 AM