Share News

Rayalaseema Lift Irrigation Scheme: సీమ లిఫ్టు.. ఆపేసింది జగనే

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:42 AM

కేంద్ర జలశక్తి, పర్యావరణ-అటవీ శాఖలు, అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే రూ.3,378 కోట్ల అంచనాతో ‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌...

Rayalaseema Lift Irrigation Scheme: సీమ లిఫ్టు.. ఆపేసింది జగనే

  • అయినా అడ్డగోలుగా అవాకులు

  • అనుమతుల్లేవు.. డీపీఆర్‌ కూడా లేదు

  • అయినా రూ.3,378 కోట్ల అంచనాతో 2020 మే 5న ప్రాజెక్టుకు జగన్‌ శ్రీకారం

  • స్టే విధించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌

  • పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు

  • స్టే ఎత్తివేయించేందుకు మూడున్నరేళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కారు

  • నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు

  • తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెల్లడి

  • ఈ వివాదంలో చంద్రబాబుపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తు

  • వాస్తవాలు వెల్లడవడంతో చిత్తు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే ఆపేశారని రాష్ట్రప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. తన ఒత్తిడితోనే ఈ పథకం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపివేశారంటూ తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై వాస్తవాలేమిటో ప్రజల ముందు ఉంచాయి. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి అలా మాట్లాడి ఉంటారని.. అయితే వాటి ఆధారంగా చంద్రబాబుపైన, కూటమి ప్రభుత్వంపైన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని స్పష్టంచేశాయి. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ పథకాన్ని అటకెక్కించారంటూ నాటి పరిణామాలు, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలను సవివరంగా తెలియజేశాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కేంద్ర జలశక్తి, పర్యావరణ-అటవీ శాఖలు, అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే రూ.3,378 కోట్ల అంచనాతో ‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం’కు అప్పటి సీఎం జగన్‌ 2020 మే 5న ఆమోదం తెలిపారు. శ్రీశైలం జలాశయం ఎగువన 800 అడుగుల నుంచి సంగమేశ్వరం వద్ద రోజుకు ఒక టీఎంసీ చొప్పున కుడికాలువలోకి ఎత్తిపోస్తామన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారుచేయకుండానే శ్రీకారం చుట్టారు. పర్యావరణ మదింపు కూడా చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)ని ఆశ్రయించారు.


డీపీఆర్‌, పర్యావరణ అనుమతుల్లేకుండా ఏకంగా పనులే ప్రారంభించారని తెలిపారు. పనులేమీ చేపట్టడం లేదని.. డీపీఆర్‌ తయారీకే తవ్వకాలు చేస్తున్నామని జగన్‌ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎన్‌జీటీ ఆ పథకంపై స్టే విధించింది. ఈ ఎత్తిపోతలకు కేంద్ర పర్యావరణ-అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు తప్పనిసరని, అవి వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని అదే ఏడాది అక్టోబరు 29న స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వులు వెలువడ్డాక జగన్‌ మూడున్నరేళ్లు పైనే అధికారంలో కొనసాగారు. కానీ ఎన్‌జీటీ స్టే ఉత్తర్వులను ఎత్తివేయించేందుకు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. వాస్తవం ఇలా ఉంటే.. తన వల్లే సీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని.. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించడంతో.. ఈ పథకాన్ని చంద్రబాబే ఆపేశారని వైసీసీ ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో, కూలి-నీలి మీడియాలో విషప్రచారం మొదలుపెట్టింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు.. ఎప్పుడేం జరిగిందో ప్రభుత్వ వర్గాలు ఆదివారం బహిర్గతం చేశాయి. కూటమి ప్రభుత్వానికి ఈ పథకంతో సంబంధమే లేదని.. జగన్‌ హయాంలోనే అది ఆగిపోయిందని ఏర్కొన్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల సాకుతో అయాచిత రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీ ఎత్తుగడ బూమ్‌రాంగ్‌ అయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో..

వైసీపీ అధికారంలో ఉండగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిందని ప్రభుత్వ వర్గాలు పునరుద్ఘాటించాయి. జగన్‌ అనాలోచిత నిర్ణయాలత్లో రాష్ట్రానికీ, ప్రధానంగా రాయలసీమకూ తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపాయి. ‘అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దంటూ 2020 ఆగస్టులోనే కేంద్ర జలశక్తి శాఖ జగన్‌ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జలశక్తి మంత్రి నేతృత్వంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని కేంద్రం నుంచి సుస్పష్టమైన ఆదేశాలు అందాయి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని 2020 అక్టోబరులో మరోసారి రాష్ట్రప్రభుత్వాన్ని ఎన్‌జీటీ నిర్దేశించింది. వీటిపై ట్రైబ్యునల్‌లో జగన్‌ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించలేదు. ఇప్పుడు చంద్రబాబుపై రాజకీయంగా బురదజల్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తన హయాంలో జరిగినవాటిని కప్పిపుచ్చి.. రాజకీయ లబ్ధి పొందేందుకు ఎత్తువేశారు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్‌ జమానాలో ఎన్‌జీటీ ఆదేశాలతో నిలిచిపోయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు న్యాయపోరాటం చేస్తున్నామని.. ఈ నెల 22న బలమైన వాదనలు వినిపించబోతున్నామని తెలిపాయి.


102 ప్రాజెక్టులను ఆపేసిన జగన్‌..

సీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్‌ ఎందుకు పూర్తి చేయలేకపోయారు.. కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు తీసుకురాలేకపోయారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ‘ఆయన సీఎంగా ఉండగానే.. 102 రాయలసీమ ప్రాజెక్టులను అర్ధాంతరంగా నిలిపివేస్తూ ప్రీ-క్లోజర్‌ ఆదేశాలిచ్చారు. 2014-19 మధ్య ఆ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా.. జగన్‌ తన ఐదేళ్ల ఏలుబడిలో రూ.2,011 కోట్లే ఖర్చుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3,870 కోట్లతో 100 రోజుల్లోనే 738 కిమీ మేర హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి కుప్పం వరకూ నీటిని తరలించాం. సీమ ప్రాజెక్టులపై ప్రస్తుతం రూ.6,613 కోట్లు ఖర్చుచేస్తున్నాం. సీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలు అమలు చేస్తున్నాం. రిజర్వాయర్లలోని నీటి నిల్వలను సమర్థంగా వినియోగించేలా యాజమాన్య నిర్వహణ చేపట్టాం. కాలువలు, పైపులైన్ల ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేందుకు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధంచేశాం’ అని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.


అబద్ధాలు.. అభూత కల్పనలు.. అవినీతి, స్కాంలు వాటన్నిటికీ ప్యాంటూ చొక్కా తొడిగితే జగనే: నిమ్మల

అబద్ధాలు, అభూతకల్పనలు, అవినీతి, కుంభకోణాలకు ప్యాంటు, చొక్కా తొడిగితే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవుతాడని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు. నిజానికి, నిబద్ధతకు సీఎం చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమన్నారు. జగన్‌ అవినీతి పత్రికలో ఒక పేజీ అబద్ధాలు అచ్చోసినా.. రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో లేరని నిమ్మల ఆదివారం మీడియాతో అన్నారు. ‘రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రీ చేయనంత ద్రోహం జగన్‌ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే ఐదో తేదీన ఆమోద ముద్ర వేసి.. అదే ఏడాది అక్టోబరు 29వ తేదీన ఎన్‌జీటీలో నిలిపివేత ఉత్తర్వులు వచ్చేలా చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులకు జగన్‌ తన ఐదేళ్ల ఏలుబడిలో పట్టించుకోలేదు. హంద్రీ-నీవాకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. సముద్రంలోకి ఏటా 3000 టీఎంసీలు వృథాగా పోతున్న గోదావరి జలాల్లో 200 టీఎంసీలు వాడుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఏమిటి? తెలంగాణ రాష్ట్ర వివాదాలను ఆంధ్రప్రదేశ్‌లోకి చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 05 , 2026 | 05:45 AM