సీమ లిఫ్టుపై లేకిమాటలు!
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:52 AM
అధికారంలో ఉన్న ఐదేళ్లూ సీమ అని కూడా పలుకని వైసీపీ నేతలు.. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై లేకి మాటలు మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
వైసీపీ నేతలపై పయ్యావుల ఫైర్
ఆ ప్రాజెక్టు ఆగింది మీ హయాంలోనే
ఓట్ల కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు
జగన్ జమానాలో వెయ్యి కోట్లు మాత్రమే
మేం 40 వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం: కేశవ్
అనంతపురం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న ఐదేళ్లూ సీమ అని కూడా పలుకని వైసీపీ నేతలు.. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై లేకి మాటలు మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వారికి సిగ్గుందా అని నిలదీశారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమే వారి లక్ష్యమన్నారు. మంగళవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమ లిఫ్టు ప్రాజెక్టుపై వైసీపీ నేతలు సభలు పెట్టారని.. వారిలో చాలా మందికి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎక్కడకు వస్తాయి.. ఎన్ని వస్తాయో కూడా తెలియదన్నారు. ‘ఆ ప్రాజెక్టు వైసీపీ హయాంలోనే ఆగితే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై 2020 అక్టోబరు 29న జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ తవ్వకాలు చేస్తున్నది ప్రాజెక్టు కోసం కాదని, డీపీఆర్ తయారీ కోసమని అప్పటి చీఫ్ సెక్రటరీ 2021లో ఎన్‌జీటీ ముందు చెప్పారు. అనంతరం 2023లో మరోసారి ఇది సాగునీటి ప్రాజెక్టు కాదని, కేవలం తాగునీటి ప్రాజెక్టు అని జగన్ ప్రభుత్వం మాటమారుస్తూ జీవో ఇచ్చింది’ అని వివరించారు. జగన్ ప్రభుత్వంలో వెయ్యి కోట్లు మాత్రమే సీమ ప్రాజెక్టులపై వ్యయం చేశారని.. టీడీపీ హయాంలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నామని తెలిపారు.
ఐదేళ్లూ ఉరవకొండలో చిన్న కాలువ, రోడ్డు, స్కూలు భవనం కూడా కట్టని వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో హంద్రీ-నీవా పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. కనీసం గంపెడు మట్టి కూడా తియ్యలేదని మండిపడ్డారు. తుంగభద్ర డ్యాం ఒక్క గేటు కొట్టుకుపోతే తాము యుద్ధప్రాతిపదికన స్పందించామన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్నమయ్య, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే దిక్కులేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం, జిల్లా రైతాంగానికి నీళ్లు అందించడం కోసం కూలీలుగా పనిచేస్తున్నామని.. సీఎం చంద్రబాబు తమతో ఆ విధంగా పనులు చేయిస్తున్నారని కేశవ్ చెప్పారు.