40 వేల కోట్లతో సీమలో హార్టీకల్చర్ హబ్
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:29 AM
‘రాబోవు రోజుల్లో రాయలసీమలో హార్టీకల్చర్ హాబ్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇది భవిష్యత్‌లో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బలమైన అభివృద్ధికి దారి తీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్‌గా మారుతుంది’
బలమైన ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉన్నా సంక్షేమానికి ఢోకాలేదు: మంత్రి పయ్యావుల కేశవ్
నంద్యాల, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ‘రాబోవు రోజుల్లో రాయలసీమలో హార్టీకల్చర్ హాబ్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇది భవిష్యత్‌లో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బలమైన అభివృద్ధికి దారి తీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్‌గా మారుతుంది’ అని నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజనతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. సూపర్-6 హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కానీ ఇవేమీ పట్టనట్టుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి పయ్యావుల విమర్శించారు. శనివారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ భవనంలో 2026-27 బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమం జరిగింది. అనంతరం న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, కలెక్టర్ రాజకుమారి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డితో కలిసి మంత్రి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేశాం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో రాబడిలో దాదాపు 99 శాతం వరకు జీతభత్యాలు, పెన్షన్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఉద్యోగులకు రూ. 30 వేల కోట్ల బకాయిలు ఉండగా.. గత మార్చి 31న రూ.6 వేల కోట్లు, ఈ ఏడాది మార్చిలో రూ.7 వేల కోట్లు విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం సుమారు రూ.2,34,000 కోట్లు కాగా.. అప్పులతో కలిసి రూ.3,32,000 కోట్లు. రెవెన్యూ వ్యయం సుమారు రూ.2,56,000 కోట్లు. ఈ ఏడాది రూ. 50 వేల కోట్ల మూలధన వ్యయానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రధానంగా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 24,819 కోట్ల బిల్లులను కూటమి ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కొత్త వనరులు సృష్టించాల్సిన అవసరం ఉంది. వివిధ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎన్టీఆర్ భరోసాకు రూ.33 వేల కోట్లు, దీపం పథకానికి రూ.2 వేల కోట్లు, తల్లికి వందనానికి సుమారు రూ.10 వేల కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ. 6,600 కోట్లు కేటాయించాం.’’ అని స్పష్టం చేశారు.