సీమ ఉద్యాన హబ్‌కు 20,884 కోట్ల రుణం!
ABN , Publish Date - May 13 , 2026 | 05:22 AM
రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన హబ్ కోసం వెలిగొండ సహా ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.20,884.35 కోట్ల ప్రపంచ ..
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన హబ్ కోసం వెలిగొండ సహా ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.20,884.35 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం తీసుకునేందుకు కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీని ద్వారా 12,60,611 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపింది. ఇందులో 9,00,051 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,60,560 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఉంటుందని జల వనరుల శాఖ పేర్కొంది. ఉద్యాన హబ్‌కు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందిస్తుంది. మిగతా 40శాతం ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆమోదానికి ఈ ప్రతిపాదనలు పంపింది. వెలిగొండ ప్రాజెక్టు తొలి, రెండో దశల పూర్తికి రూ.2047 కోట్లు అవసరమవుతాయని తెలిపింది. కొరిశపాడు ఎత్తిపోతలకు రూ. 150 కోట్లు, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు-177 కోట్లు, మల్లెమడుగు ఎత్తిపోతల-231 కోట్లు, బాలాజీ రిజర్వాయరు-524.61 కోట్లు, కేబీసీ మాదన్నపల్లె రిజర్వాయరు-171 కోట్లు, హంద్రీ-నీవా సుజలస్రవంతి ప్రధాన కాలువ విస్తరణ-రూ.812 కోట్లు.. 490 కిమీ నుంచి 554 కిమీ దాకా విస్తరణ-420 కోట్లు.. నీవా బ్రాంచ్ కెనాల్-505 కోట్లు.. అల్తూరుపాడు రిజర్వాయరు-723 కోట్లు, జీడిపల్లి రిజర్వాయరు-అప్పర్ పెన్నా-639 కోట్లు.. జీడిపల్లి-భైరవానితిప్ప ఎత్తిపోతల-846.38 కోట్లు, కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు-500 కోట్లు, మడకశిర బ్రాంచ్ కెనాల్-1166 కోట్లు.. పేరూరు ఎత్తిపోతల-1189 కోట్లు, గాలేరు-నగరి సుజల స్రవంతి-1617.24 కోట్లు, అక్కడి నుంచి కోడూరు దాకా త రలింపు-1640 కోట్లు, 190 కిమీ నుంచి 240 కిమీ వరకూ విస్తరణ-911 కోట్లు, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ-778 కోట్లు, వేదవతి ఎత్తిపోతల పథకానికి రూ.1835 కోట్లు అవసరమని ఆ శాఖ ప్రతిపాదించింది.