రాయదుర్గం ప్రజలకు ఎంత చేసినా తక్కువే
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:25 AM
రాయదుర్గం ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ పార్క్‌లో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ మంగళవారం నిర్వహించిన ‘అక్షరం అండగా..
రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు
100 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం
ప్రజలకు ఎమ్మెల్యే కాలవ హామీ
రాయదుర్గంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ‘అక్షరం అండగా..’ కార్యక్రమం
రాయదుర్గం, మార్చి 24(ఆంధ్ర జ్యోతి): రాయదుర్గం ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ పార్క్‌లో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ మంగళవారం నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ప్రజల వద్దకు అధికారులను, ప్రజాప్రతినిధులను నేరుగా తీసుకువచ్చి, సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ చొరవ చూపుతోందని అభినందించారు. సీసీ రోడ్లు, డ్రైన్‌ల నిర్మాణానికి వంద రోజులు గడువు ఇవ్వాలని, ఈ పనులకు రూ.3కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 5, 6, 7, 8, 9వ వార్డులకు చెందిన సుమారు 400 మంది పాల్గొని తమ సమస్యలను అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ‘అక్షరం అండగా...’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలు వార్డుల్లో సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ 23న కథనం ప్రచురించింది. దానిపై స్పందించిన ఎమ్మెల్యే, 2, 3 వార్డుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు తాగునీటి మోటారును, స్విచ్‌బోర్డును మరమ్మతు చేశారు. మంగళవారం కార్యక్రమం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి, రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.
ఈవ్‌టీజింగ్ సమస్య పరిష్కారానికి చర్యలు
ఏలూరు క్రైం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఏలూరులో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఈ నెల 15న మినీ బైపాస్ గ్రీన్ సిటీలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే ఎజెండాగా’ కార్యక్రమంలో ఈవ్‌టీజింగ్ సమస్యను స్థానికులు ప్రస్తావించారు. మహిళలు, విద్యార్థినులతో కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కొద్దిరోజుల నుంచి ఆ ప్రాంతంలో పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తూ స్థానికులకు భరోసా కల్పించారు. సమస్యలు ఎదురైతే 112కు కాల్ చేయాలని, పది నిమిషాల్లో శక్తి టీమ్ పోలీసులు చేరుకుంటారని సీఐ సుబ్బారావు సూచించారు.
కర్నూలులో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్
కర్నూలు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం 44, 45 వార్డుల పరిధిలోని పలు కాలనీల్లో సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20న ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో స్థానికులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారంలో భాగంగా మంగళవారం డ్రైనేజీల్లో పూడిక తీత, రోడ్లు శుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ పారిశుధ్య సిబ్బంది మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేశారు. నగరపాలకసంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పనులను పరిశీలించారు. తక్షణమే రూ.10 లక్షలతో మాచాని సోమప్ప నగర్ కాలనీ పార్కు అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంఈ మనోహర్‌రెడ్డి, ఏఈ షేక్షాలను కమిషనర్ ఆదేశించారు. రూ.87 లక్షలతో మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపడతామని తెలిపారు.

గూడూరు టూటౌన్ అభివృద్ధికి రూ.1.25 కోట్లు
ప్రకటించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
నెల్లూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహిస్తున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు టూటౌన్‌లోని కాస్మోపాలిటిన్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దసంఖ్యలో స్థానికులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, టూటౌన్ ప్రాంత ప్రజల కోరిక మేరకు రూ.1.25 కోట్లతో డ్రైనేజీ కాలువలు, సీసీరోడ్లు నిర్మిస్తామని చెప్పారు. పీ4 పథకం కింద దాతల సహకారంతో రెండు పార్కులను అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. విందూరు పంప్‌హౌస్‌కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
