టీటీడీ ఈవోగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:19 AM
టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సాంప్రదాయ వస్త్రధారణతో ముందుగా వరాహస్వామిని దర్శించున్న అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్న రవిచంద్రకు అదనపు..
తిరుమల, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సాంప్రదాయ వస్త్రధారణతో ముందుగా వరాహస్వామిని దర్శించున్న అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్న రవిచంద్రకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. తర్వాత క్యూలైన్ ద్వారా రవిచంద్ర ఆలయంలోకి వెళ్లారు. రంగనాయక మండపంలో ఈవోగా, టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేవుడిపై భక్తివిశ్వాసాలు సన్నగిల్లకుండా, అందరి మనోభావాలు నిలబెట్టేలా ప్రయత్నిస్తానన్నారు. కల్తీ నెయ్యి అంశంపై బదులిస్తూ, టీటీడీ అధికారులు ఇచ్చిన నోట్స్ చదివానని, ముందే ఒక భావనతో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చూసి ఏం చేయాలో ఆలోచిస్తామని బదులిచ్చారు. తనకంటే ముందు పనిచేసిన అధికారుల సూచనలు, సలహాలు, చాలా ఏళ్లుగా తిరుమలలో పనిచేస్తూ అనుభవం పొందిన వారితో ఒక టీంగా ఏర్పడి పనిచేస్తామన్నారు. అనంతరం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.