రావణ్‌కు రిటైర్డ్ అధికారులతో సంబంధాలు నిజమే
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:18 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్‌తో పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు లింకులు ఉన్నమాట నిజమేనని రావణ్ సన్నిహితురాలు గుడిపూటి గమన పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతో మాట్లాడేవాడు
అతని అభిప్రాయాలు.. మా ఆలోచన ఒకటే
అందుకే మా ఇళ్లలోనే వీడియోలకు అనుమతి
విచారణలో వెల్లడించిన గమన, ఇంద్రసేన
ఏడున్నర గంటలపాటు సాగిన విచారణ
సమాధానాల దాటవేత.. 17న మరో విడత
విజయవాడ, జూలై 13(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్‌తో పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు లింకులు ఉన్నమాట నిజమేనని రావణ్ సన్నిహితురాలు గుడిపూటి గమన పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఉపా చట్టం కింద అరెస్టయి జైల్లో ఉన్న రావణ్‌తో సంబంధం ఉన్న ఒక్కొక్కరినీ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. రావణ్ కాల్‌డేటా ఆధారంగా వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన గమన, హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంద్రసేనా చౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విచారించారు. సుమారుగా ఏడున్నర గంటలపాటు ఈ విచారణ సాగింది. బెంగళూరులో బొటిక్ నిర్వహిస్తున్న గమన.. యూట్యూబ్‌లో రావణ్ వీడియోలను ఫాలో అయ్యేది. బొటిక్ నిర్వహిస్తూనే సోషల్ మీడియా రీల్స్ చేస్తుంటుంది. ఈ రెండింటి ద్వారా రావణ్, గమన మధ్య పరిచయం ఏర్పడింది. గమనకు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇంద్రసేనా చౌదరి బంధువు. ఆమె ద్వారా రావణ్‌కు ఇంద్రసేన కూడా పరిచయమయ్యాడు. రావణ్ వీడియోలు రూపొందించేందుకు గమన, ఇంద్రసేన తమ ఇళ్లలో అవకాశం ఇచ్చారు. గమన, ఇంద్రసేన, రావణ్ మధ్య బంధం రెండేళ్ల నుంచి ఉందని పోలీసులు నిర్ధారించారు. తరచుగా రావణ్ కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎ్‌సలతో వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతుండేవాడని తాజా విచారణలో గమన వెల్లడించినట్టు సమాచారం. రావణ్ ఒక గదిలో ఒంటరిగా ఉండి మాట్లాడేవాడని చెప్పినట్టు తెలిసింది. ‘వారి పేర్లు తెలుసా?.’ అని అడిగితే మౌనం వహించినట్టు సమాచారం.
మా ఆలోచనలు కలిశాయి!
గమన, ఇంద్రసేనా చౌదరిలను డీఎస్పీ కార్యాలయంలో వేర్వేరు గదుల్లో విచారించారు. ఈ విచారణలో అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు వారిద్దరు డొంకతిరుగుడు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఇంద్రసేనకు సంబంధించిన అపార్టుమెంట్‌లో స్టూడియో నడపడంపై అధికారులు ప్రశ్నించారు. దీనికి పలు సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. రావణ్‌తో ఎందుకు పరిచయం పెంచుకోవాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నించగా.. తన అభిప్రాయాలకు రావణ్ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయని గమన చెప్పినట్టు సమాచారం. యూట్యూబ్‌లో ఆయన వీడియోలు చూసిన తర్వాత వాటి పట్ల ఆకర్షితురాలినయ్యానని చెప్పినట్టు తెలిసింది. రావణ్ అడగడం వల్ల కొన్ని ఇంటర్వ్యూలు, అతనికి అనుకూలంగా రీల్స్ చేశానని పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఈ నెల 17న మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసు ఇచ్చి పంపారు.