రేషన్ మాఫియా!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:50 AM
రేషన్ మాఫియా సామ్రాజ్యం బాగానే విస్తరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో డజనుకుపైగా డాన్‌లు, అరడజనుకుపైగా హిడెన్ డాన్‌లు ఉన్నారు. ఈ వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండటంతో బెజవాడలో కొత్త ముఖాలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. వీరందరి వెనుక రాజకీయ శక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఒక్క జయంతి సత్యంపై చర్యలు తీసుకుని వదిలేస్తే ఫలితం ఉండదు. మిగిలిన వారిపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ఉమ్మడి జిల్లాలో డజనుకు పైగా డాన్‌లు
- బయటకురాని మరికొంతమంది హిడెన్ డాన్‌లు
- బెజవాడలో ఎంట్రీ ఇస్తున్న కొత్త ముఖాలు
- ఈ డాన్‌లను పట్టుకుంటేనే రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట
- జయంతి సత్యం వెనుక నందిగామ షాడో ఎమ్మెల్యే!
రేషన్ మాఫియా సామ్రాజ్యం బాగానే విస్తరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో డజనుకుపైగా డాన్‌లు, అరడజనుకుపైగా హిడెన్ డాన్‌లు ఉన్నారు. ఈ వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండటంతో బెజవాడలో కొత్త ముఖాలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. వీరందరి వెనుక రాజకీయ శక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఒక్క జయంతి సత్యంపై చర్యలు తీసుకుని వదిలేస్తే ఫలితం ఉండదు. మిగిలిన వారిపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తున్న రేషన్ డాన్ జయంతి సత్యంపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరి మిగిలిన రేషన్ డాన్‌ల సంగతి ఏమిటి? ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తిరువూరు, విజయవాడ, గన్నవరం, పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గానికో రేషన్ డాన్ ఉన్నాడు. డజను మందికి పైగా డాన్‌లు, మరో అర డజనుకుపైగా హిడెన్ డాన్‌లు ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వీరిలో కొంతమందిపై జిల్లా బహిష్కరణ వేటు కూడా పడింది. అయినా ఇప్పటికీ పేదల బియ్యాన్ని దేశ సరిహద్దులు దాటించేస్తున్నారు. జయంతి సత్యం (కాజ సత్యనారాయణ) అరెస్టు నేపథ్యంలో, పోలీసులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. జయంతి సత్యం ఎలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ? ఎవరెవరి భాగస్వామ్యం ఉంది ? ఎవరి సహకారం ఉంది ? ఎలా అక్రమ రవాణా చేస్తున్నారు ? ఎక్కడికి రవాణా చేస్తున్నారు ? వంటి వివరాలను రాబట్టి .. మిగిలిన డాన్ల సమాచారాన్ని కూడా తెలుసుకుని, వారిపై కూడా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఒక ప్రజాప్రతినిధి మెప్పు కోసమే ఈ పని చేశారని భావించే ప్రమాదం ఉంది.
అడుగడుగునా డాన్‌లు..
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అడుగడుగునా రేషన్ డాన్‌లు ఉన్నారు. విజయవాడ నగరంలో కళ్ల ముందే ‘కోటి’ అనే వ్యక్తి డాన్‌గా ఎదిగాడు. ఉమ్మడి జిల్లాలో నరేంద్ర, రామచంద్రరావు, బాబూజీ, రంగారావు, రాము వంటి వారు కేసులను ఎదుర్కొన్న రేషన్ డాన్‌లు ఉన్నారు. వీరితో పాటు పెనమలూరు, గుడివాడ, విజయవాడలో తెరవెనుక ఉంటూ.. తన ఐడెంటిటీ బయటకు రాకుండా రేషన్ సామ్రాజ్యంలో భాగస్వాములుగా ఉన్న హిడెన్ డాన్స్ మరికొందరు ఉన్నారు. ఈ డాన్స్ అందరికీ రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని లాగేసుకుంటున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పోర్టులకు తరలించి దేశాలనే దాటించేస్తున్నారు. ఒక్క డాన్ మీద చర్యలు తీసుకుంటే.. మిగిలిన డాన్‌లు తమ అక్రమాలను ఆపేస్తారా ? జయంతి సత్యంను సమగ్రంగా విచారించటం ద్వారా రేషన్ మాఫియా వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తోంది.. రేషన్ బియ్యాన్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారు ? వీరి వెనుక ఉన్న శక్తులు ఏమిటి ? వంటివి చైన్‌లింక్‌గా తెలుసుకుని డాన్‌లను అదుపులోకి తీసుకుంటే.. రేషన్ మాఫియాకు ముకుతాడు పడుతుంది.
మాజీ రౌడీ షీటర్ అండతో దందా!
రేషన్ వ్యాపారంతో తేలిగ్గా రూ.కోట్లు సంపాదించవచ్చన్న ఉద్దేశ్యంతో మాజీ రౌడీషీట్‌ర్‌లు కూడా ఈ రంగంలోకి దిగుతున్నారు. తమ బంట్లుగా కొంతమంది రాజకీయ నాయకులను తెర మీద పెడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ రౌడీషీటర్ అండతో ఓ రాజకీయ పార్టీ నేత రేషన్ దందాకు తెరతీశాడు. పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ డీలర్లంతా కూడా తమకే బియ్యం విక్రయించాలని దందాగిరీ చేస్తున్నాడు. డీలర్లను బెదిరించడం రివాజుగా మారింది.
షాడోకు ఖరీదైన గిఫ్ట్!
నందిగామ షాడో ఎమ్మెల్యే నీడన పడగ విప్పిన రేషన్ డాన్ జయంతి సత్యం మహా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఏ ప్రభుత్వం వచ్చినా నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేదే పెత్తనం. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న రీతిన వ్యవహరించే ఈ షాడో అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. జయంతి సత్యానికి అండగా చాలా కాలంగా నందిగామ షాడో ఎమ్మెల్యే ఉంటున్నాడు. జయంతి సత్యం నియోజకవర్గానికి రూ.20 లక్షలు చొప్పున ముఖ్య నేతలకు సమర్పిస్తాడు. ప్రతి మండలానికి కీలక నేతలు ఎవరైతే ఉంటారో వారికి రూ. 2 లక్షల చొప్పున ఇస్తాడు. ఆ తర్వాత విజిలెన్స్, పోలీసులు, రెవెన్యూ, స్థానిక మీడియాకు ఎవరి లెక్కన వారికి మామూళ్లు ఇస్తుంటాడు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత షాడో ఎమ్మెల్యే జయంతి సత్యం నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నట్టు సమాచారం. ఇదే సందర్భంలో రూ.30 లక్షలు విలువ చేసే కారు కూడా గిఫ్ట్‌గా అందుకున్నట్టు తెలుస్తోంది. ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన తర్వాత నెలవారీగా ఇవ్వాల్సిన మామూళ్లు జయంతి సత్యం ఆపేయడంతో.. షాడో బాస్‌కు కోపం వచ్చినట్టు సమాచారం. దీంతో జయంతి సత్యంను పక్కన పెట్టి మరొక వ్యక్తిని తెరమీదకు తెచ్చాడని, ఆ వ్యక్తి సరిగా పనిచేయకపోవడంతో మళ్లీ తప్పక జయంతి సత్యానికి అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. ఇక అప్పటి నుంచి జయంతి సత్యం వెనుదిరిగి చూడలేదు.
‘ద్వారంపూడి’కి ద్వారం తెరిచారు!
రేషన్ మాఫియాలో కీలకమైన ‘ద్వారంపూడి’కి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రేషన్ డాన్‌లు ద్వారం తెరిచారు. ద్వారంపూడికి చెందిన కొంతమంది ఈ డాన్‌లతో సంబంధాలు పెట్టుకుని కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి బల్క్‌గా కాకినాడ పోర్టుకు బియ్యాన్ని తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ద్వారంపూడి వర్గీయులకు అధికారికంగా పంపగలుగుతున్నారు. రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన వారిపై అధికారులు దాడులు చేసి పట్టుకున్న బియ్యాన్ని కొంత కాలం తర్వాత సివిల్ సప్లయిస్ అధికారులు వేలం వేస్తారు. ఇలా వేలం వేసిన బియ్యాన్ని కూడా రేషన్ డాన్‌లు కొంటారు. ఇలా వేలంలో కొన్నపుడు అధికారికంగా.. ఒక పత్రం ఇస్తారు. ఈ పత్రంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని రెండు రోజుల్లో తరలించాలని ఎక్కడా ఉండదు. దీంతో ఈ పత్రాన్ని అడ్డుపెట్టుకుని పోర్టులకు రాజమార్గంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తారు. అదే పత్రంతో రేషన్ బియ్యం రవాణా నిరంతరాయంగా జరుగుతుంది.