Share News

‘రేషన్‌’ హైడ్రామా!?

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:53 AM

గుడివాడలో పట్టుబడిన రేషన్‌ బియ్యం వ్యవహారంలో హైడ్రామా నడిచింది. లారీ, మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిపోతున్న రేషన్‌ బియ్యాన్ని వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. కాగితాలు సరిగ్గా లేవని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ తెల్లారేసరికి ఆ రెండు వాహనాలు అక్కడ మాయమై ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రత్యక్షమయ్యాయి. రంగంలోకి దిగిన పీడీఎస్‌ అధికారులు ఏవో జిరాక్స్‌ కాపీలు చూపిస్తూ అంతా సక్రమమేనని తేల్చేశారు. దీని వెనుక రేషన్‌ మాఫియా హస్తం ఉన్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి.

‘రేషన్‌’ హైడ్రామా!?

- లారీ, మినీ వ్యాన్‌లో రేషన్‌ బియ్యం తరలింపు

- బుధవారం అర్ధరాత్రి పట్టుకున్న వన్‌టౌన్‌ పోలీసులు

- కాగితాలు సరిలేవని స్టేషన్‌కు తరలింపు

- తెల్లారేసరికి మాయం.. ప్రైవేటు వెంచర్‌లో ప్రత్యక్షం

- వాటిలో రూ.25 లక్షల విలువైన 670 బస్తాలు ఉన్నట్టు సమాచారం

- అంతా సక్రమమేనని తేల్చిన పీడీఎస్‌ అధికారులు

- తెరవెనుక చక్రం తిప్పిన రేషన్‌ మాఫియా

గుడివాడలో పట్టుబడిన రేషన్‌ బియ్యం వ్యవహారంలో హైడ్రామా నడిచింది. లారీ, మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిపోతున్న రేషన్‌ బియ్యాన్ని వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. కాగితాలు సరిగ్గా లేవని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ తెల్లారేసరికి ఆ రెండు వాహనాలు అక్కడ మాయమై ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రత్యక్షమయ్యాయి. రంగంలోకి దిగిన పీడీఎస్‌ అధికారులు ఏవో జిరాక్స్‌ కాపీలు చూపిస్తూ అంతా సక్రమమేనని తేల్చేశారు. దీని వెనుక రేషన్‌ మాఫియా హస్తం ఉన్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఆంధ్రజ్యోతి-గుడివాడ :

స్థానిక ముబారక్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారనే అనుమానంతో వన్‌టౌన్‌ ఎస్సై వై.వి.వి.సత్యనారాయణ ఓ లారీ, మినీ వ్యాన్‌ను నిలుపుదల చేశారు. వారు ఎటువంటి కాగితాలు చూపకపోవడంతో ఆ రెండు వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గురువారం తెల్లవారు జామున ఆ రెండు వాహనాలు మాయమై, నాగవర ప్పాడు, వాసవీ నగర్‌లోని ప్రైవేటు వెంచర్‌లో ప్రత్యక్షమయ్యాయి. అక్కడ ఈరెండు వాహనాలకు ఇద్దరు కానిస్టేబుళ్లు కాపలాగా ఉండటం గమనార్హం.

పౌరసరఫరాశాఖ అత్యుత్సాహం!

స్థానిక పోలీసులు అందించిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టుకున్న బియ్యం సక్రమమేనంటూ కితాబు ఇచ్చేశారు. ఏపీ 16వై 8994 నెంబరు గల లారీ ద్వారా 580 బస్తాల బియ్యాన్ని కైకలూరు నుంచి ఏలూరు పౌరసరఫరాల శాఖకు తరలించినట్లు, నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో ఏలూరులో సదరు బియ్యం తిరస్కరణకు గురైనట్లు చూపుతూ నివేదికను తీసుకువచ్చారు. అయితే సదరు నివేదికపై ఎటువంటి తేదీ గానీ, సంవత్సరం గానీ లేకపోవడం, వే బిల్లు నెంబరు చేతితో రాసి ఉండటం, జిరాక్స్‌ కాపీని చూపడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇదే బియ్యాన్ని ఉయ్యూరు, సాంబశివ ట్రేడర్స్‌ వారు కొనుగోలు చేశారని పౌరసరఫరాల శాఖ అధికారులే ధ్రువీకరించేశారు. బియ్యం కొన్నట్టు బిల్లులు, వే బిల్లులు ఉన్నాయంటూనే మీడియాకు చూపించేందుకు నిరాకరించారు. ఉయ్యూరుకు చెందిన బియ్యంగా పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ధారించేశారు. 580 బస్తాలకు లెక్క ఉన్నట్లు చూపించి, మిగిలిన 90 బస్తాల బియ్యాన్ని దర్జాగా నొక్కేశారని విమర్శలు విని పిస్తున్నాయి.

రేషన్‌ మాఫియా రంగ ప్రవేశంతో..

గుడివాడలో వన్‌టౌన్‌ పోలీసులు అర్ధరాత్రి వేళ 670 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకోవడంతో రేషన్‌ మాఫియా ఖంగుతింది. వెంటనే మాఫియా ప్రతినిధులు గుడివాడలో వాలిపోయారు. పౌరసరఫరాల శాఖ అధికారులను రంగంలోకి దించారు. అంతా సక్రమంగా ఉన్నట్లు కాగితాలను సృష్టించి, ఎవరికి ముట్టజెప్పాల్సింది వారికి ఇచ్చేసి దర్జాగా రూ.25లక్షల విలువైన 670 బస్తాల బియ్యాన్ని పట్టుకుపోయారని సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలోని పీడీఎస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఒకరు ఇక్కడ ప్రత్యక్షమై డీల్‌ను కుదిర్చినట్లు కార్యాలయ వర్గాల్లో వినికిడి.

కొనుగోలు రశీదుపై అనుమానాలు!

ఎట్టకేలకు పౌరసరఫరాల శాఖ అధికారులు కైకలూరులోని దుర్గా జైభవాని ట్రేడర్స్‌ నుంచి ఉయ్యూరులోని సాంబశివ ట్రేడర్స్‌ కొనుగోలు చేసినట్లు బిల్లులను చూపారు. అయితే సదరు బిల్లుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులో ఏపీ 28 టీఏ 5899 లారీ ద్వారా బియ్యం తరలిస్తున్నట్లు చూపారు. అయితే వన్‌టౌన్‌ పోలీసులు ఏపీ 39 యూకే 2099 నెంబరు గల లారీ, ఏపీ 39 డబ్ల్యూఈ 7322 నెంబరు గల మినీ వ్యాన్‌ల్లో బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో కొనుగోలు చేసినట్లు చూపుతున్న బిల్లును అప్పటికప్పుడు సృష్టించారని స్పష్టమవుతుంది.

పట్టుకున్న లారీ ఎక్కడిది?

పోలీసులు పట్టుకున్న బియ్యం లారీ ఇక్కడి కాదనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తర భారత దేశంలో వాడే తరహాలో లారీ క్యాబిన్‌, లారీపై పరీ లాజిస్టిక్స్‌ అని, హిందీలో రెండు, మూడు చోట్ల పేర్లు ఉండటం ఆ అనుమానాలను బలపరుస్తుంది. లారీకి స్థానిక రిజిసే్ట్రషన్‌ నెంబరు ఉండటం కూడా అనుమానాస్పదంగా మారింది. అక్కడి నుంచి లారీ కొని ఇక్కడికి తీసుకువచ్చి రిజిసే్ట్రషన్‌ చేయించారా లేక దొంగ నెంబర్లు వేసి తిప్పుతున్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది.

Updated Date - Jan 30 , 2026 | 12:53 AM