Share News

తెగిన చేతిని అతికించారు

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:37 AM

మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యుల బృందం అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.

తెగిన చేతిని అతికించారు

  • ఎయిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స

మంగళగిరి సిటీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యుల బృందం అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ట్రాన్స్‌-హ్యూమరల్‌(మిడ్‌ ఆర్మ్‌) యాంప్యుటేషన్‌ రీప్లాంటేషన్‌ నిర్వహించి, యువకుడి శరీరం నుంచి వేరుపడిన చేతిని విజయవంతంగా అమర్చినట్టు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... ‘జార్ఖండ్‌కు చెందిన 25 సంవత్సరాల యువకుడు ఓ రోడ్డు నిర్మాణ సంస్థలో మిషన్‌ లోడ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 22న హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలో తారు మిషన్‌లో చేయి ఇరుక్కొని యువకుడి ఎడమ చేయి శరీరం నుంచి వేరుపడి నుజ్జయింది. క్షతగాత్రుడ్ని హుటాహుటిన మంగళగిరి ఎయిమ్స్‌ అత్యవసర విభాగానికి తరలించారు. యువకుడి పరిస్థితిని నిశితంగా పరిశీలించిన వైద్య బృందం అవయవ మనుగడకు అవసరమైన రక్త ప్రసరణ ప్రక్రియను ఆరు గంటలలోపు పునరుద్ధరించారు. డాక్టర్‌ శాంతకుమార్‌ శివలింగప్ప నేతృత్వంలోని ప్లాస్టిక్‌ సర్జరీ బృందం, డాక్టర్‌ లిఖిత రెడ్డి, డాక్టర్‌ మనోజ్‌ నేతృత్వంలోని ఆర్థోపెడిక్‌ సర్జరీ బృందం, కార్డియోథొరాసిక్‌, వాస్కులర్‌ సర్జరీ, అనస్తీషియా విభాగాల వైద్యులు చికిత్సను ప్రారంభించారు. మైక్రోసర్జికల్‌ పద్ధతుల ద్వారా ప్రధాన రక్తనాళాలను పునర్నిర్మించి, ఎముకను స్థిరీకరించడం, కండరాలు, మృదు కణజాలాలను సరిచేయడం ద్వారా చేతిని విజయవంతంగా తిరిగి అమర్చారు. సుమారు 8 గంటలపాటు శస్త్రచికిత్స కొనసాగింది. అత్యంత అరుదుగా నిర్వహించే ఈ అధునాతన మైక్రోసర్జికల్‌ రీప్లాంటేషన్‌ విధానాలు దేశంలో అతి కొద్ది చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని 14 రోజులపాటు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి, అవయవాలు, మూత్రపిండాల పనితీరును పరిశీలించారు. రోగి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వార్డులో కోలుకుంటున్నాడని చెప్పారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఆయా విభాగాల వైద్యులు, సిబ్బందిని ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అహంతెం శాంతాసింగ్‌ అభినందించారు.

Updated Date - Mar 10 , 2026 | 05:37 AM