Share News

పురుష లక్షణాలు తగ్గి.. స్త్రీ లక్షణాలు మొదలు!

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:01 AM

ఆ యువకుడి వయసు 36 ఏళ్లు.. ఉన్నట్టుండి కాళ్ల కండరాలు బలహీనపడ్డాయి. ఆ బలహీనత చేతులకు కూడా పాకింది. ఆస్పత్రికి వెళితే అది అరుదైన కెన్నెడీ డిసీజ్‌ అని తేలింది.

పురుష లక్షణాలు తగ్గి.. స్త్రీ లక్షణాలు మొదలు!

  • సెక్స్‌ హార్మోన్ల సమతుల్యతలో తీవ్ర మార్పులు

  • గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అరుదైన కెన్నెడీ డిసీజ్‌ కేసు

గుంటూరు మెడికల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆ యువకుడి వయసు 36 ఏళ్లు.. ఉన్నట్టుండి కాళ్ల కండరాలు బలహీనపడ్డాయి. ఆ బలహీనత చేతులకు కూడా పాకింది. ఆస్పత్రికి వెళితే అది అరుదైన కెన్నెడీ డిసీజ్‌ అని తేలింది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఇది వెలుగు చూసింది. 1962లో తొలిసారిగా కెన్నెడీ, ఆయన సహచర బృందం ఈ వ్యాధిని కనిపెట్టడంతో దీనికి ఆయన పేరు పెట్టారు. గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఎం విజేయుడు ఈ నెల 12న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి న్యూరాలజీ విభాగానికి రాగా హెచ్‌వోడీ డాక్టర్‌ గాజుల రామకృష్ణ వైద్యపరీక్షలు చేసి కెన్నెడీ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని స్పైనల్‌, బల్బార్‌ మస్క్యులర్‌ అట్రోపీ (ఎస్‌బీఎంఏ)గా పిలుస్తారని డాక్టర్‌ రామకృష్ణ తెలిపారు. ఈ వ్యాధి బారినపడిన వారిలో హార్మోన్ల సమతుల్యతలో మార్పు వస్తుంది. పురుష సెక్స్‌ హార్మోన్‌ టెస్టోస్టిరాన్‌ స్థాయి బాగా తగ్గిపోతుంది. ఫలితంగా వీరిలో పురుష లక్షణాలు తగ్గి క్రమేపీ స్త్రీ లక్షణాలు (ఫెమినైజేషన్‌) ఏర్పడతాయి. స్త్రీల వలే ఉరోజాలు ఏర్పడటం (గైనకోమ్యాస్టియా), వృషణాల పరిమాణం తగ్గడం (టెస్టికల్‌ అట్రోఫీ), వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, లైంగిక ఆసక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని డాక్టర్‌ రామకృష్ణ తెలిపారు. విజేయుడు కుటుంబంలో ముగ్గురు మేనమామలతో పాటు మరికొంత మంది బంధువులు ఇదే వ్యాధికి గురైనట్లు పేర్కొన్నారు. కెన్నెడీ వ్యాధికిచికిత్స లేదని, వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు మందులు ఇస్తున్నామని చెప్పారు.

Updated Date - Jun 18 , 2026 | 04:03 AM