Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:15 AM

దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని భూమధ్య రేఖ పరిసరాల్లో ఉన్న హిందూ మహాసముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

  • ఫిబ్రవరిలో ఏర్పడడం చాలా అరుదు

విశాఖపట్నం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని భూమధ్య రేఖ పరిసరాల్లో ఉన్న హిందూ మహాసముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈనెల 18నాటికి నైరుతి బంగాళాఖాతం/హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలపడుతుంది. ఆ తర్వాత ఉత్తర శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఏ మేరకు ఉంటుందనేది రెండు రోజుల తరువాత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. సాధారణంగా ఫిబ్రవరిలో బంగాళాఖాతంలో తుఫాన్‌లు/వాయుగుండాలు/అల్పపీడనాలు అరుదుగా వస్తుంటాయి. 1891 నుంచి 2024 వరకు కేవలం ఏడు తుఫాన్‌లు/వాయుగుండాలు (1944, 1947, 1950, 1961, 1999, 2011, 2022) వచ్చాయి.

కోస్తాలో దట్టంగా పొగమంచు

కోస్తాలోని అనేక ప్రాంతాల్లో సోమవారం దట్టంగా పొగమంచు కురిసింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా ఉంది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయని పేర్కొంది. కర్నూలులో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Feb 17 , 2026 | 04:15 AM