అరకులో అరుదైన మొక్కలు..!
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:06 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ ప్రాంతంలో అరుదైన సైథియేసి గిగాంటియా (ట్రీ ఫెర్న్), లైకోపోడియం క్లావాటం (క్లబ్ మాస్, క్లబ్ నాచు) అనే ప్రాచీనకాలం నాటి జాతి మొక్కలు ఉన్నాయి.
నర్సీపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ ప్రాంతంలో అరుదైన సైథియేసి గిగాంటియా (ట్రీ ఫెర్న్), లైకోపోడియం క్లావాటం (క్లబ్ మాస్, క్లబ్ నాచు) అనే ప్రాచీనకాలం నాటి జాతి మొక్కలు ఉన్నాయి. తేమ ఎక్కువగా, స్థిరమైన వాతావరణం ఉండే అడవుల్లో మాత్రమే ఈ రెండు రకాల మొక్కలు కనిపిస్తుంటాయని.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ట్రైనీ డీఎఫ్‌వోగా పనిచేస్తున్న ఐఎ్‌ఫఎస్ అధికారి సదానందన్ తెలిపారు. ఈ మొక్కలకు సంబంధించిన పలు విషయాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేశారు. శిక్షణలో భాగంగా ఆయన అరకులోయలో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలోనే ఈ మొక్కలు తారసపడడంతో వాటిని కెమెరాలో బంధించారు.
అడవుల ఆరోగ్యాన్ని సూచించే మొక్కలివి..
సైథియేసి గిగాంటియా అనేది ఈశాన్య భారతం, ఆసియాలోని తేమ ప్రదేశాలల్లో పెరిగే అరుదైన చెట్టు (ట్రీ ఫెర్న్) అని సదానంద తెలిపారు. ఈ మొక్క ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరగగలదని, దీని ఆకులు రెండు మీటర్ల పొడవు ఉంటాయని చెప్పారు. పటిష్ఠమైన కాండంతో చూడడానికి తాటిచెట్టులా కనిపిస్తుందన్నారు. ఈ వృక్ష సంపద 200 మిలియన్ సంవత్సరాల కాలం నాటిదని తెలిపారు. ప్రాచీనకాలం నాటి మరో చెట్టు లైకోపోడియం అని, భూమిపై అతి ప్రాచీన వాస్క్యులర్ మొక్కల్లో ఒకటిగా దీన్ని గుర్తించారని పేర్కొన్నారు. నేల మీద పాకే క్లబ్ మాస్ మొక్క అని, దీనికి చిన్న సూది వంటి ఆకులు ఉంటాయని చెప్పారు. ఈ రెండు మొక్కలు అడవుల ఆరోగ్యాన్ని సూచించే బయోఇండికేటర్లుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. మానవ అవసరాల కోసం అడవులను నాశనం చేయడం వల్ల ఇలాంటి అరుదైన జాతులు ప్రమాదంలో పడుతున్నాయన్నారు. తూర్పు కనుమల్లో జీవ వైవిద్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని సదానంద తెలిపారు.