Share News

ఇంకా షాక్‌లోనే విద్యార్థులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:42 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై దాడి సంఘటనను విద్యార్థులు మరచిపోలేకపోతున్నారు

ఇంకా షాక్‌లోనే విద్యార్థులు
counselling

  • రాప్తాడు ఘటనతో భయం భయం

  • మానసిక నిపుణులను నియమించిన ప్రభుత్వం

  • విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్‌

అనంతపురం విద్య, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై దాడి సంఘటనను విద్యార్థులు మరచిపోలేకపోతున్నారు. తరగతి గదిలోనే ఓ ఉన్మాది ఎలక్ర్టిక్‌ రంపంతో విచక్షణారహితంగా దాడి చేయడం, తరగతి గది రక్తపు మడుగులా మారడంతో ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నారు. సంఘటన జరిగిన పదో తరగతి గదిలోని విద్యార్థులందరూ షాక్‌కు లోనయ్యారు. కొందరు విద్యార్థినులు ఘటన గురించి తల్లిదండ్రులకు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో భయం పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యార్థులలో భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య కౌన్సిలర్లను నియమించింది. వారు ఇళ్లవద్దకే వెళ్లి పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.


లోకేశ్‌ ఆదేశాలతో.. జడ్పీ ఉన్నత పాఠశాలలో మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకురావాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు పిల్లల్లో భయం పోగొట్టేందుకు కౌన్సెలింగ్‌ ఇప్పించాలని నిర్ణయించారు. డీఈవో అయూబ్‌ హుస్సేన్‌, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సిలర్లను ఏర్పాటు చేశారు. వీరు ఆదివారమే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన గదిలో ఉంటున్న విద్యార్థుల వివరాలు తీసుకుని, వారి ఇళ్లకే వెళ్తున్నారు. పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, వారిలో ధైర్యం నింపుతున్నారు. కుటుంబ సభ్యులకూ పలు సూచనలు ఇస్తున్నారు. పిల్లలతో ఎలా నడుచుకోవాలి, ఎలాంటి మాటలు చెప్పాలో వివరిస్తున్నారు. బడిలో కూడా అన్ని తరగతుల పిల్లలకు ప్రత్యేక తరగతులు తీసుకుని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి బాలికను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదివారం పరామర్శించారు. ఆర్జేడీ శామ్యూల్‌, డీఈవో అయూబ్‌ హుస్సేన్‌తో కలిసి విద్యార్థిని చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రులను కమిషనర్‌ కలిసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 04:43 AM