Share News

చెరువులో శవమయ్యాడు

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:24 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కలవరం సృష్టించిన చిన్నారిపై హత్యాచారం కేసులో రేపిస్టు కులవర్ధన్‌ చెరువులో శవమయ్యాడు.

చెరువులో శవమయ్యాడు

  • బాలిక రేపిస్టు కులవర్ధన్‌ ఆత్మహత్య!

  • పోలీసు వాహనంలో తరలిస్తుండగా తప్పించుకుని పారిపోయిన వైనం

  • రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు.. చివరికి చెరువులో దొరికిన మృతదేహం

  • రేపిస్టు మృతితో మదనపల్లెలో సంబరాలు.. సీఎం చిత్రపటానికి మహిళల పాలాభిషేకం

  • చిన్నారికి పూర్తయిన అంత్యక్రియలు

అన్నమయ్య, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కలవరం సృష్టించిన చిన్నారిపై హత్యాచారం కేసులో రేపిస్టు కులవర్ధన్‌ చెరువులో శవమయ్యాడు. మంగళవారం రాత్రి వాహనంలో తరలిస్తుండగా కులవర్ధన్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం ఉదయం కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లెలో కుటుంబ సభ్యులు, బంఽధువుల కన్నీటి వీడ్కోలునడుమ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం....మద్యం, గంజాయి మత్తులో ఉన్న కులవర్ధన్‌ చిన్నారిపై హత్యాచారం చేశాక తన గదిలో నిద్రపోయాడు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు తలుపు తట్టినా తీయలేదు. దీంతో మంగళవారం ఉదయం తలుపు బద్దలు కొట్టి, ఇంట్లోకి వెళ్లి చూడగా పాప మృతదేహం నీటి డ్రమ్ములో ఉంది. ఘటన గురించి తెలియగానే పట్టణంలో వందలాదిమంది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. నిందితుడిని తక్షణమే శిక్ష విధించాలని, అతణ్ణి తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకుని రక్షక్‌ వాహనంలో తీసుకెళ్తుండగా దారిలో వాహనం నుంచి దూకి పారిపోయాడు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తుండగా, తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లెచెరువులో మృతదేహం ఉన్నట్లు వీఆర్వో సుస్మిత బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మృతదేహాన్ని కులవర్ధన్‌దిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసేందుకు అతని తల్లి, చెల్లెలు ఎవరూ రాలేదు. సమీప బంధువు నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.


మదనపల్లెలో సంబరాలు

కులవర్ధన్‌ ఆత్మహత్యపై మదనపల్లెలో బాణసంచా పేల్చి జనం ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారి ఇంటి వద్ద నుంచి మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చిన్నారికి ఆమె స్వగ్రామం కడప జిల్లా వీరబల్లి మండలంలో కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు జరిపి కన్నీటి వీడ్కోలు పలికారు.

కులవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు: ఎస్పీ

కులవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్‌ బుధవారం మీడియాకు తెలిపారు. ‘‘కులవర్ధన్‌ పోలీసుల అదుపులోంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం స్థాఽనికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు’’ అని వివరించారు.


  • వాడు బతికుంటే నేనే చంపేసేదాన్ని

  • చిన్నారి తల్లి ఆగ్రహం

అన్నమయ్య, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘వాడు చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడో, మరెలా చచ్చాడో తెలియదు. కానీ వాడు బతికుంటే నేనే చంపేసేదాన్ని. వాళ్లమ్మకు కూడా విషయం తెలుసంటున్నారు. ఆమెను వెతకాలి. వాళ్లిల్లు కూలకొట్టాలి’ అంటూ చిన్నారి తల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. కాగా, ఈ హత్యాచారాన్ని నిరసిస్తూ మంగళవారం జరిగిన ఆందోళనలో కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు కనిపెట్టారు. ప్రభుత్వానికి, వ్యవస్థకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేసినట్టు గుర్తించారు. ఆ సమయంలో డ్రోన్‌ కెమెరాలతో రికార్డు చేసిన దృశ్యాలను పరిశీలించారు. కొందరు వ్యక్తులు తమ రాజకీయ, రహస్య ఎజెండాను నెరవేర్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలుసుకున్నా రు. ఈ వ్యవహారంలో పలువురికి పోలీసుల నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

Updated Date - Feb 19 , 2026 | 03:26 AM