Share News

రామ్మూర్తి ఘనాపాఠి కన్నుమూత

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:42 AM

ప్రఖ్యాత వేద పండితుడు రామ్మూర్తి ఘనాపాఠి(72) శుక్రవారం కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నివసించే ఆయన...

రామ్మూర్తి ఘనాపాఠి కన్నుమూత

  • రుగ్వేద సలక్షణ ఘనాపాఠిగా కీర్తి.. ప్రముఖ వేద పండితుల సంతాపం

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత వేద పండితుడు రామ్మూర్తి ఘనాపాఠి(72) శుక్రవారం కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నివసించే ఆయన కంచిలో ఉండే తనయుడు రాజీవ్‌ను చూడడానికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం సాయంత్రం చంద్రగిరి తీసుకొచ్చి మిట్టపాళెంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. రామ్మూర్తి తండ్రి కృష్ణమూర్తి తిరుమలలో ఉంటూ ఇతర ప్రాంతాల్లో పౌరోహిత్యం నిర్వహించేవారు. రామ్మూర్తి తిరుమలలో పుట్టి, అక్కడి వేద పాఠశాలలో చదువుకొని, అదే పాఠశాలలో అధ్యాపకత్వం వహించారు. రుగ్వేదంపై పరిశోధన చేసి రుగ్వేద సలక్షణ ఘనాపాఠిగా కీర్తి గడించారు. దేశంలో వేద భాష్యం చదువుకున్న పది మంది వేద పండితుల్లో రామ్మూర్తి ఒకరు. జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం ఉన్నట్టు శిష్యులు చెబుతారు. ఆయన వద్ద వేదం చదువుకున్న వందమంది ప్రస్తుతం తిరుమల సహా పలు ప్రముఖ క్షేత్రాల్లో వేదపండితులుగా ఉన్నారు. టీటీడీ ఈవోలుగా చేసిన రమణాచారి, ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రమణ్యం వేద సంబంధ అంశాలను తెలుసుకునేందుకు ఈయనను సంప్రదించేవారు. రామ్మూర్తి మృతి పట్ల పలువురు ప్రముఖ వేద పండితులు సంతాపం ప్రకటించారు.

Updated Date - Feb 21 , 2026 | 05:43 AM