Share News

రామగిరి బంగారం గనులను తెరిపిస్తాం

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:41 AM

రామగిరి బంగారం గనులను తెరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మూతపడిన భరత్‌ గోల్డ్‌ మైన్‌ యూనిట్‌ను రాప్తాడు..

రామగిరి బంగారం గనులను తెరిపిస్తాం

  • ఖనిజాన్ని చోరీ చేసినవారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు

ధర్మవరం, జూలై 15(ఆంధ్రజ్యోతి): రామగిరి బంగారం గనులను తెరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మూతపడిన భరత్‌ గోల్డ్‌ మైన్‌ యూనిట్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు తదితరులతో కలసి బుధవారం ఆయన పరిశీలించారు. ‘కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్‌ మైనింగ్‌ను ఇటీవల ప్రారంభించాం. అక్కడ రోజుకు కిలో బంగారాన్ని తీస్తున్నారు. రామగిరి బంగారం గనులను తెరిచేందుకు అనుమతులొచ్చాయి. జొన్నగిరిలో టన్నుకు ఒక గ్రాము బంగారం మాత్రమే లభిస్తోంది. కానీ రామగిరిలో టన్నుకు 4 గ్రాములు బంగారం లభిస్తుంది. చిత్తూరు జిల్లాలో చిగురుగుంట, శ్రీసత్యసాయి జిల్లాలో రామగిరితో పాటు మూడు ప్రాంతాలను మైనింగ్‌ కోసం గుర్తించాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. ఇక్కడ మొత్తం 4.60 లక్షల టన్నుల ఖనిజం ఉండాలి. ఇందులో లక్ష టన్నుల వరకు చోరీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపిస్తాం. బాధ్యులపై చర్యలు తప్పవు’ అని మంత్రి కొల్లు హెచ్చరించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ... ‘వైసీపీ ప్రభుత్వంలో విలువైన ఖనిజాన్ని ఇక్కడి నుంచి తరలించారు. దాదాపు వెయ్యి టిప్పర్ల ఖనిజాన్ని ఇక్కడ నుంచి వైసీపీ నాయకులు తరలించారు’ అని ఆరోపించారు.

Updated Date - Jul 16 , 2026 | 05:42 AM