Share News

ప్రశాంతంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

ABN , Publish Date - May 04 , 2026 | 04:35 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం ఏడు గంటల 14 నిమిషాలకు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు భూమిపూజ చేశారు.

ప్రశాంతంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

  • ఆకివీడు పెదపేటలో భారీ పోలీసు బందోబస్తు

ఆకివీడు, మే 3 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం ఏడు గంటల 14 నిమిషాలకు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని దళిత సంఘాలు పిలుపు నివ్వడంతో...ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 580 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భూమిపూజ ప్రాంగణం లోపలికి వచ్చేవారిని మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసి పంపించారు. పూజల అనంతరం రఘురామ మాట్లాడుతూ 800 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు కృష్ణ శిల్ప రాళ్లతో రామాలయం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి బందోబస్తు పర్యవేక్షించారు.


150 మంది బైండోవర్‌

పెదపేట రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన నేపథ్యంలో బహుజన సమాజ్‌ వాదీ పార్టీ(బీఎస్పీ) నేతలు రాష్ట్రం నలుమూలలు నుంచి ఆకివీడుకు బయలుదేరారు. అనంతపురం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా తదితర జిల్లాల నుంచి రైళ్ల ద్వారా సుమారు మూడు వందల మంది ఆకివీడు చేరుకున్నారు. పెదపేటలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఉండడంతో జాతీయ రహదారిపై జైభీమ్‌ అంటూ నిరసనలు చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. వీరిలో 150 మందిని భైండోవర్‌ చేసినట్టు ఆకివీడు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. అలాగే వివిధ వాహనాల్లో వస్తున్న వారిని జిల్లాలోని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - May 04 , 2026 | 04:36 AM