శాస్త్రోక్తంగా రామతీర్థం విగ్రహాలకు జలాధివాసం
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:41 AM
వందల ఏళ్ల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలను కోటిపల్లి పుణ్యక్షేత్రంలో సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా జలాధివాసం చేశారు.
కె.గంగవరం, ఏప్రిల్13(ఆంధ్రజ్యోతి): వందల ఏళ్ల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలను కోటిపల్లి పుణ్యక్షేత్రంలో సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా జలాధివాసం చేశారు. శ్రీరామ భక్తులు, కూటమి నాయకులు తరలిరాగా వేద పండితులు హోమం చేసి పూర్ణాహుతి ఇచ్చి స్వామి వార్ల విగ్రహాలను గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి క్షీరాన్నాభిషేకం, పుష్పాభిషేకం చేసి జలాధివాసం చేశారు. కాగా.. రామతీర్థం క్షేత్రంలోని భిన్నమైన విగ్రహాలను శాస్త్ర ప్రకారం గోదావరి నదిలో జలాఽధివాసం చేశామని దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ పేర్కొన్నారు. కోటిపల్లి పుష్కరాల రేవులో ఆయన మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలోని రామాలయంలో 2020 డిసెంబరులో రాములవారి విగ్రహం తలభాగాన్ని వేరుచేసి దుండగులు చెరువులో పడేశారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే భిన్నమైన విగ్రహాలను అలా ఉంచకూడదని, వేద పండితుల సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతోపాటు కోర్టు సూచనల మేరకు జలాధివాసం కార్యక్రమం ఏర్పాటు చేశామని కమిషనర్ చెప్పారు. సోమవారం ఉదయం 5 గంటలకు రామతీర్థంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన శోభాయాత్ర సింహాచలం, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామ మీదుగా సాయంత్రం కోటిపల్లి చేరుకుంది.