Share News

రామతీర్థం విగ్రహాలు రేపు గోదావరిలో నిమజ్జనం

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:25 AM

విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన కోదండరాముడితో పాటు సీతాలక్ష్మణుల విగ్రహాలను ఈ నెల 13న డాక్టర్‌ కోనసీమ జిల్లా కోటిపల్లి వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేయనున్నారు.

రామతీర్థం విగ్రహాలు రేపు గోదావరిలో నిమజ్జనం

  • వైసీపీ హయాంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

  • ఆగమశాస్త్రం ప్రకారం నిమజ్జనానికి పండితుల నిర్ణయం

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన కోదండరాముడితో పాటు సీతాలక్ష్మణుల విగ్రహాలను ఈ నెల 13న డాక్టర్‌ కోనసీమ జిల్లా కోటిపల్లి వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేయనున్నారు. 2020లో వైసీపీ ప్రభుత్వ హయాంలో రామతీర్థంలోని నీలాచలం కొండపై కొలువైన కోదండరాముడి విగ్రహం తలను దుండగులు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి రామతీర్థం ఆలయంలోనే తల భాగాన్ని భద్రపరిచారు. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. సంప్రదాయం ప్రకారం ధ్వంసమైన విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని ఆగమ పండితులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజుతో పాటు దేవదాయ శాఖాధికారుల దృష్టికి రామతీర్థం అధికారులు తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ఈ నెల 13న తెల్లవారుజామున రామతీర్థం ఆలయంలో పూజలు చేసి 6 గంటలకు విగ్రహాలను వాహనంలో తీసుకుని బయలుదేరుతారు. మధ్యాహ్నం అన్నవరం దేవస్థానం, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవ స్థానం, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. సాయంత్రం 3.45 గంటలకు కోటిపల్లి గ్రామానికి చేరుకుని విగ్రహాలకు శాంతి హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 4.48 గంటలకు విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు.

Updated Date - Apr 12 , 2026 | 05:26 AM