ప్రయోగాలే ఆయన విజయం!
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:04 AM
అనంతపురం జిల్లా పేరు చెబితేనే మండే ఎండలు, కరువు గుర్తుకు వస్తాయి. అలాంటి నేలపై మంచు ప్రాంతాల్లో పండే యాపిల్‌ను సాగు చేసి, విజయం సాధించారు రైతు రమణారెడ్డి.
వ్యాపారి నుంచి రైతుగా మారిన రమణారెడ్డి
గార్లదిన్నె, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా పేరు చెబితేనే మండే ఎండలు, కరువు గుర్తుకు వస్తాయి. అలాంటి నేలపై మంచు ప్రాంతాల్లో పండే యాపిల్‌ను సాగు చేసి, విజయం సాధించారు రైతు రమణారెడ్డి. రెండున్నర ఎకరాల్లో 1500 యాపిల్ మొక్కలు నాటి, తొలి పంటను టన్ను రూ.1.50 లక్షలకు విక్రయించి, ఔరా అనిపించుకున్నారు. రమణారెడ్డి అనంతపురం నగరంలోని సిండికేట్ నగర్‌లో ఉంటూ.. మగ్గం నేస్తూ, పట్టు చీరల వ్యాపారం చేశారు. వ్యాపారంలో వచ్చిన లాభాలతో గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల్లో 13 ఎకరాలు కొన్నారు. తొలుత నాలుగెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, మరో మూడెకరాల్లో ఖర్జూర పంట వేసి, లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత యాపిల్ పంట సాగు చేసినా ఉష్ణోగ్రతలు అనుకూలించక దిగుబడి రాలేదు. అయినా వెనక్కు తగ్గకుండా.. అనంతపురం జిల్లా వాతావరణానికి తట్టుకునే యాపిల్ రకాల కోసం య్యూటూబ్‌లో సోధించి, ఇక్కడి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ఇజ్రాయెల్‌లో కూడా యాపిల్ పండిస్తున్నారని తెలుసుకున్నారు. 2024 అక్టోబరులో ఇజ్రాయెల్‌లో ఉన్న తన స్నేహితుడి ద్వారా కేఎల్‌డీ రకం యాపిల్ మొక్కలు రప్పించుకున్నారు. రెండున్నర ఎకరాల్లో మొక్కలు నాటారు. ఏడాదికి పూత వచ్చి పిందెలు వచ్చాయి. యాపిల్ విరగకాయడంతో ఒక్కో మొక్కకు 130-150 పిందెలను ఉంచి, మిగిలిన వాటిని తొలగించాడు. దీంతో ఉన్న కాయలు నాణ్యంగా, లావుగా వచ్చాయి. మొదటి కోతలో కేజీ రూ.150 చొప్పున బెంగళూరులోని మోర్ మార్ట్‌కు ఒక టన్ను విక్రయించాడు. యాపిల్ సాగు ఆసక్తి ఉన్నవారు 9490856363కు ఫోన్ చేస్తే సలహాలు ఇస్తానన్నారు.