జీవన తాత్వికను బోధించే రంజాన
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:41 PM
రంజాన్ మాసం ఆరంభ సూచికగా బుధవారం సాయంకాం ఆకాశంలో నెలవంక కనిపించింది.
ఆకాశంలో కనిపించిన నెలవంక
నేటి నుంచి రంజాన మాసం ఆరంభం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపావాసాలకు, ప్రార్థనలకు సిద్ధం
కర్నూలు కల్చరల్, చాగలమర్రి, మద్దికెర, ఽఆళ్లగడ్డ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్ మాసం ఆరంభ సూచికగా బుధవారం సాయంకాం ఆకాశంలో నెలవంక కనిపించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు నెలరోజుల పాటు రంజాన్ నెలలో పాటించే ఉపవాస (రోజా) దీక్షలకు సిద్ధమయ్యారు. ఈ మాసంలో ఆకలిదప్పుల్ని జయించడం, తోటివారి ఆకలిని, అవసరాలను గుర్తించి, వారిపట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవడం, తాము సంపాదించినదానిలో పేదలకు ఖర్చు చేయడం, నిత్యం ఖురాన పఠనంలో గడపడం ఈ మాసంలోని ప్రత్యేకతలు. జీవన తాత్వికతపై ఎరుక కలిగించడమే ఇస్లాం ధార్మికత సారాం. ఇస్లాంను జీవితంలో ఆచరించమని రంజాన మాసం ఉద్బోధిస్తుంది. ముప్పై రోజుల పాటు నమాజులతో, పధ్నాలుగు గంటల పాటు ఉపవాసం పాటిస్తారు. సాయంత్రం దీక్షల ముగింపు సమయానికి ఉపాహారంగా హలీమ్ కేంద్రాలు, పండ్లు, ఫలహార కేంద్రాలు వెలిసాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యికి పైగా మసీదులు ఉండగా, ఒక్క కర్నూలు నగరంలో 200 వరకు మసీదులు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా మసీదులకు రంగులు వేసి ముస్తాబు చేశారు. నిత్యం ఐదు పూటల నమాజు చేయడానికి, ప్రత్యేక ఈద్ నమాజ్‌లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మసీదుల కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఫ సుగుణాలను ప్రేరేపించే ఉపవాసం:
రంజాన్ మాసంలో పాటించే ఉపవాసం భక్తుల్లో సుగుణాలను ప్రేరేపిస్తుంది. ఆకలిదప్పుల బాధ అంటే ఏమిటో తెలిపేదే ఉపవాసం. ధనవంతులకూ, పేదలకూ ఆకలి బాధ తెలియజేయడం ఇస్లాం ధార్మికతలోని ముఖ్యమైన అంశం. తద్వారా మనిషిలో దైవభావం పెంచడాన్ని దివ్య ఖురాన్ గ్రంథం ‘తఖ్వా’ అని అంటుంది. ‘ఉపవాసం వల్ల దైవభయం అనే సుగుణం మనిషిలో కలుగక పోయినట్లయితే అతను ఉపవాసం ఉన్నట్లే కాదు’ అని ప్రవక్త (స.అ.సం) అంటారు. ‘ఉపవాసం ఉంటూ అబద్ధాలు విడువకపోతే ఆ ఉపవాసంలో అల్లాహ్‌కు ఏ సంబంధమూ లేదు’ అని అంటారు. రంజాన్ నెల ప్రతి రోజూ వేకువ జాము నుంచి సూర్యాస్తమయం వరకు దాదాపు 14 గంటలు ఉపవాసం పాటిస్తారు.
ఫ రోజా నియమాలు...ప్రాముఖ్యత ఇదీ...
ఇస్లాం సౌధానికి ఉండే మూల స్తంభాల్లో రంజాన్ ఉపవాస వ్రతాలు ఒకటి. ఈ ఉపవాసాలు విస్మరించడం అంటే మొత్తం ఇస్లాంనే విస్మరించడం. వ్రతాలు పాటిస్తున్నప్పుడు వాటి బాహ్య నియమాలతోపాటు, అంతర్ నియమాలు కూడా తప్పకుండా పాటించాలి. అబద్ధ్దాలు, చాడీలు, దూషణలు, పరోక్ష నిందలకు దూరంగా ఉండాలి. అశ్లీల మాటలు, తగాదాలకు దూరంగా ఉండాలి. ఇది ఇతర సమయాల్లోనూ అనుసరించాలి. ఉపవాసం విశ్వ ప్రభువు తమపై మోపిన విధి (ఫర్జ్)గా భావిస్తారు. ఉపవాసం అనేది ప్రతి యుగంలోనూ దైవ ప్రవక్తల ద్వారా విశ్వాసులకు విధిగా నిర్ణయిస్తూ వచ్చింది. అందుకు దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ (2:183)ఈ విషయాన్ని ఇలా వివరిస్తుంది. ‘విశ్వాసులారా! మీకు పూర్వం దైవ ప్రవక్తల్ని అనుసరించే వారికి ఎలా ఉపవాసం విధిగా చేయబడిందో..మీపైకూడా అలాగే ఉపవాసం విధిగా నిర్ణయించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించగలవు’అని ఖురాన బోధించింది. మనుషులను భయభక్తులుగల వారిగా తీర్చిదిద్దడం, వారి హృదయాన్ని పరిశుద్ధ పరచడం, పాపకర్మల పట్ల దృష్టి సారిస్తూ మంచికార్యాల వైపు మొగ్గే స్థితిని పెంపొందించడమే ఉపవాస దీక్షల ఉద్దేశం.
ఫ రంజాన్ ’దివ్య ఖురాన్’ అవతరించిన నెల..
రంజాన్ నెలలోనే పవిత్ర గ్రంథం ’దివ్య ఖురాన్’ అవతరించింది. సర్వ మానవాళికి ఖురాన్ గ్రంథం మార్గదర్శనం చేసింది. సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఆదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
ఫ ’జకాత్’ దాన ధర్మాల ఆచరణ..
రంజాన్ మాసంలో దానం చేయడాన్ని జకాత్ అంటారు. తన దగ్గర ఉన్న ధనం నుంచి రెండున్నర శాతం నిర్ణీత మొత్తంలో బీదవారికి దానం చేస్తారు. మానవునిలోని ధన వ్యామోహాన్ని దూరం చేసేందుకు విశ్వ ప్రభువు అతనిపై జకాత్‌ను విధిగా (ఫర్జ్‌గా) నిర్ణయించాడు.
ఫ నమాజుల ప్రాముఖ్యం..
ఉపవాసాలతోపాటు ప్రతిరోజూ ఐదు పూటల నమాజ్‌తో, అదనంగా రాత్రి ఇషా నమాజ్ ఆ తర్వాత 20 రకాతుల తరావీహ్ నమాజులు ఆచరించాలి. రంజాన్ మాసంలో అధికంగా దైవ ధ్యానం చేయాలని, దివ్య ఖురాన్ గ్రంథాన్ని కనీసం ఒకసారైనా పారాయణం చేయాలని విశ్వ ప్రభువు ఆజ్ఞగా ప్రవక్త బోధించాడు
ఫ ఫిత్రా దానాలు..ఇఫ్తార్ విందులు..
రంజాన్ నెలలో సహృదయంతో, దైవభక్తితో ఒక సత్కార్యం చేసిన వ్యక్తికి ఇతర మాసాల్లో చేసిన ఫర్జ్ (విధి)కి లభించే పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో బీదవారికి సుమారు పావు తక్కువ రెండు సేర్లు గోధుమలుగానీ, వాటికి సమానమైన నగదుగా లేదా, వస్త్ర రూపంలో దానం చేస్తారు. అదే విధంగా ప్రజల మధ్య సారసమ్యం పెరగడానికి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు.