‘రాజ్యసభ’ కోసం పోటాపోటీ
ABN , Publish Date - May 31 , 2026 | 04:55 AM
రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు టీడీపీలో పోటీ పెరుగుతోంది. శనివారం పలువురు ఆశావహులు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
చంద్రబాబును కలిసిన ఆశావహులు
చాన్స్ ఇవ్వాలని కోరిన
శ్రీనివాసరెడ్డి, వర్ల, కంభంపాటి
ప్రచారంలోకి వస్తున్న అనేక పేర్లు
టీడీపీ నుంచి ముగ్గురికి అవకాశం!
సుచిత్రా ఎల్లాకు టికెట్ లేనట్లే
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు టీడీపీలో పోటీ పెరుగుతోంది. శనివారం పలువురు ఆశావహులు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమకు అవకాశమివ్వాలని కోరారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనను కలిసినవారిలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి వైసీపీ తరఫున ముగ్గురు రెడ్లు ఎంపీలుగా ఉన్నారని, రెండు దశాబ్దాలుగా టీడీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యసభ ప్రాతినిధ్యం లేదని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి సీఎంను కోరారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వర్ల రామయ్య... సీనియర్ నేతగా, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తిగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కంభంపాటి రామ్మోహనరావు చంద్రబాబును కోరారు.
రెండు మూడు రోజుల్లో స్పష్టత...
రాష్ట్రం నుంచి పెద్దల సభకు వెళ్లే నలుగురు ఎవరనే అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. నాలుగు స్థానాల్లో ఒకటి జనసేనకు ఇవ్వడం ఖాయం. మరొకటి బీజేపీకి ఇస్తారని తొలుత భావించినా... ఈసారి టీడీపీలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఆ స్థానమూ తామే తీసుకునేలా బీజేపీని ఒప్పించనున్నట్లు సమాచారం. వెరసి... టీడీపీ నుంచి ముగ్గురికి రాజ్యసభ చాన్స్ దక్కనుంది. తనకు తిరిగి అవకాశమివ్వాలని సానా సతీశ్ గట్టిగా కోరుతున్నారు. లోక్‌సభ చాన్స్ మిస్ అయిన తనను రాజ్యసభకైనా పంపాలని భాష్యం రామకృష్ణ అడుగుతున్నారు. ఇక... సామాజిక సమీకరణాలనూ చూసుకోవాల్సి ఉంది. మరోవైపు... భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్రా ఎల్లా పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో నేరుగా సంబంధంలేని వారికి రాజ్యసభ అవకాశమిచ్చి ప్రయోగాలు చేయలేమని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం పని చేసిన, త్యాగం చేసిన వారికే అవకాశమిస్తే... ‘మనలో ఒకరికి’ పదవి ఇచ్చారనే భావన అందరిలో కలుగుతుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.