ఏపీ అంటే అడ్వాన్స్‌డ్ ప్రదేశ్..!
ABN , Publish Date - May 16 , 2026 | 06:06 AM
దేశానికి రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ‘ఏపీ అంటే అడ్వాన్స్‌డ్ ప్రదేశ్... దేశానికి ఓ రోల్ మోడల్’ అని అభివర్ణించారు.
దేశానికి రోల్ మోడల్.. రక్షణ కవచం: రాజ్‌నాథ్‌సింగ్
సీఎం చంద్రబాబుతో కలిసి పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమి పూజ
డిఫెన్స్, డ్రోన్ సిటీ ప్రాజెక్టులకూ శంకుస్థాపన
మన రక్షణ చరిత్రలో చరిత్రాత్మక అధ్యాయం
దేశ భద్రతకు ఇతర దేశాలపై ఆధారపడలేం
దార్శనికుడు చంద్రబాబు.. క్వాంటమ్, ఆధునిక టెక్నాలజీలను ఏపీకి తీసుకొచ్చారు
గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రాన్ని ఎంచుకున్నాయి: రక్షణ మంత్రి
వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి
ఏఎంసీఏతో 15 వేల కోట్లకుపైగా పెట్టుబడి..
7500 మందికి ఉద్యోగ అవకాశాలు
36 రోజుల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన
జెట్ స్పీడ్‌తో అనుమతులిచ్చాం
ఇక బంగారం ఉత్పత్తికీ ఏపీ కీలకం: చంద్రబాబు
ఏఎంసీఏ.. ‘అనంత’కు మా రిటర్న్ గిఫ్ట్: లోకేశ్
ఏఎంసీఏలో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని, మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయి. మన సముద్ర తీరప్రాంతాలకు పూర్తి రక్షణతో పాటు బ్లూ ఎకానమీకి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టు మారబోతోంది.
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్‌తో తీసుకెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది. వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది.
- సీఎం చంద్రబాబు
అనంతపురం/పుట్టపర్తి, మే 15 (ఆంధ్రజ్యోతి): దేశానికి రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ‘ఏపీ అంటే అడ్వాన్స్‌డ్ ప్రదేశ్... దేశానికి ఓ రోల్ మోడల్’ అని అభివర్ణించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) అభివృద్ధి చేసే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం డిఫెన్స్, కర్నూలు డ్రోన్ సిటీలోని ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. పుట్టపర్తి లాంటి విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ఏపీతోపాటు దేశ రక్షణలో చరిత్రాత్మక అధ్యాయాన్ని జోడించబోతోందన్నారు. ‘ఈ ప్రాజెక్టుతోపాటు నాలుగు డిఫెన్స్ కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది.
కర్నూలులో డ్రోన్ సిటీకి సంబంధించిన 8 కంపెనీలకూ భూమిపూజ చేశాం. దేశభద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేం. అందుకే ఆత్మనిర్భరత అనేది కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టులన్నీ స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఏపీఎంసీలో ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలు తయారవుతాయి. దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్‌తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి టెస్టింగ్ కేంద్రాలు కొన్ని దేశాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన చేరింది’ అని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) రూ.480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్‌వాటర్ వ్యవస్థలను, టార్పెడోలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఎనెర్జిటిక్స్.. ఆధునిక ఆయుధాలను తయారుచేస్తుందని చెప్పారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో భవిష్యత్ యుద్ధానికి అవసరమైన ఆధునిక వ్యవస్థలు ఈ సంస్థ ద్వారా తయారవుతాయన్నారు. హెచ్‌ఎ్‌ఫఏసీఎల్ రూ.1294 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లు తయారు చేస్తుందన్నారు. 8 డ్రోన్ కంపెనీలు ఓ డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ‘డ్రోన్ టెక్నాలజీ ఆధునిక వార్‌ఫేర్‌లో గేమ్ చేంజర్‌గా మారింది. వ్యవసాయం సహా వేర్వేరు అవసరాలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. సూరత్ డైమండ్ సిటీగా, బెంగళూరు భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందాయి. రాయలసీమలోని కర్నూలు ప్రపంచ డ్రోన్ హబ్‌గా ప్రసిద్ధి చెందుతుంది. త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీని ఆంధ్రనుంచే తయారు చేయబోతున్నాం’ అన్నారు.
ఇలాంటి నేతను చూడలేదు..
చంద్రబాబు టెక్నాలజీ, అభివృద్ధి గురించి ఆలోచించే దార్శనిక నేత అని రాజ్‌నాథ్ కొనియాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎక్కడా చూడలేదన్నారు. ఆయన క్వాంటమ్ సహా ఆధునిక టెక్నాలజీలను ఏపీకి తీసుకొచ్చారని.. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఈ రాష్ట్రాన్నే ఎంచుకున్నాయని చెప్పారు. ఏఎంసీఏ ప్రాజెక్టుకు సహకరించిన చంద్రబాబుతోపాటు ఆయన బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. సభా వేదిక వద్ద క్షిపణులు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానం ప్రొటోటైప్ తదతర ఉత్పత్తుల ప్రదర్శనను చంద్రబాబు, లోకేశ్‌తో కలిసి రాజ్‌నాథ్ తిలకించారు.
సత్యసాయి సన్నిధిలో రాజ్‌నాథ్, సీఎం చంద్రబాబు
రాజ్‌నాథ్‌సింగ్, చంద్రబాబు శుక్రవారం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. భూమి పూజ ముగిశాక వారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరానికి వెళ్లారు. సెంట్రల్ ట్రస్టు సభ్యులు వారికి స్వాగతం పలికారు. మహాసమాధిని దర్శించుకున్న అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, ఎమ్మెఎస్ రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా మహాసమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.