Share News

రాజీవ్‌రంజన్‌ నేతృత్వాన డెడికేటెడ్‌ కమిషన్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో 87 పట్టణ స్థానికసంస్థలు, గ్రామ పంచాయతీలు, మండలపరిషత్‌, జిల్లాపరిషత్‌ల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.

రాజీవ్‌రంజన్‌ నేతృత్వాన డెడికేటెడ్‌ కమిషన్‌

  • వెనుకబడిన వర్గాల స్థితిగతులపై అధ్యయనం

  • 45 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం

  • స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు

  • ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు

అమరావతి/గుంటూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 87 పట్టణ స్థానికసంస్థలు, గ్రామ పంచాయతీలు, మండలపరిషత్‌, జిల్లాపరిషత్‌ల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేముందు ట్రిపుల్‌టె్‌స్టను తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వెనుకబడిన వర్గాల డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం.. ఆ కమిషన్‌ గడువు 20-09-2025తో ముగియడంతో కొత్తగా స్వతంత్ర ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ డెడికేటెడ్‌ కమిషన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ మిశ్రాను నియమించింది. స్థానికసంస్థల వారీగా వెనుకబడిన వర్గాల స్థితిగతులు, వాటి స్వరూపం, తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి స్థానిక సంస్థకు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయిస్తూ 45 రోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. బీసీ సంక్షేమశాఖ అదనపు డైరెక్టర్‌ డి.చంద్రశేఖర్‌రాజు ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులతో సమావేశాలు, అధ్యయన పర్యటనలు చేపట్టేందుకు కమిషన్‌కు అనుమతించారు. కమిషన్‌ సిబ్బంది, పారితోషికం, ఇతర పరిపాలనా సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీచేయనున్నట్లు బీసీ సంక్షేమశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు హర్షణీయమని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 20 , 2026 | 05:03 AM