Share News

రాజంపేట లాడ్జిలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Feb 27 , 2026 | 05:09 AM

కడప జిల్లా రాజంపేటలోని దీప్‌ లాడ్జిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

రాజంపేట లాడ్జిలో అగ్నిప్రమాదం

  • షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

రాజంపేట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా రాజంపేటలోని దీప్‌ లాడ్జిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఆర్‌ఎస్‌ రోడ్డులో ఉన్న దీప్‌ లాడ్జి రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో అక్కడున్న వైర్లు, ఫ్రిజ్‌ మంటల్లో చిక్కుకున్నాయి. ఫ్రిజ్‌ సిలిండర్‌ పేలిపోవడంతో కౌంటర్‌ను అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ కౌంటర్‌ వద్ద నుంచే లాడ్జిపైకి మెట్ల మార్గం ఉంది. ఈ దారి గుండా మంటలు, పొగ పైన ఉన్న గదులకు వ్యాపించాయి. లాడ్జిలో బసచేసిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాసులు(36) మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. మంచినీటి క్యాన్‌ ద్వారా ఆయన మంటలను ఆర్పడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లాడ్జిలో బుధవారం రాత్రి 39 మంది బస చేశారు. వీరిలో కాకినాడకు చెందిన రామాంజనేయులు ప్రమాదం జరిగిన వెంటనే రాజంపేటలోని తన మిత్రుడు వెంకటాద్రినాయుడుకు ఫోన్‌ చేశారు. అగ్నిప్రమాదం జరిగిందని, తమను కాపాడాలని కోరారు. దీంతో ఆయన ఫైర్‌ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాకప సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయాలపాలైన నలుగురిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ రామ్‌నాథ్‌ హెగ్డే తెలిపారు.

Updated Date - Feb 27 , 2026 | 05:10 AM