మహా పాపం నిజం
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:23 AM
వైసీపీ వల్ల అంటుకున్న పాపాన్ని కడగడానికి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి నేతలు గురువారం ఆలయాలను శుద్ధి చేశారు...
రాజమహేంద్రవరంలో కూటమి నేతల ర్యాలీ
రాజమహేంద్రవరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ వల్ల అంటుకున్న పాపాన్ని కడగడానికి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి నేతలు గురువారం ఆలయాలను శుద్ధి చేశారు. రాజమహేంద్రవరం సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ నాయకత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని గోదావరి జలాలతో శుద్ధి చేశారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని కన్నమ్మ గుడి వద్ద నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి ముందు ఆలయం గడప కడిగి శుద్ధి చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కేడర్ కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుద్ధి చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో భీమోలులోని అక్కదేవతల అమ్మవారి ఆలయంలో, దేవరపల్లిలోని ఇందిరమ్మ కాలనీ వెంకటేశ్వరస్వామి ఆలయం, గౌరీపట్నం శివాలయంలో శుద్ధి చేసి పూజలు చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు గోష్పాదక్షేత్రం శివాలయంలో శుద్ధి చేశారు.