Share News

మెడికోలను ఢీకొట్టి.. వారిపై కారెక్కించి..

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:39 AM

సెకండ్‌ షో సినిమా చూసేందుకు ఇద్దరు యువకులు కారులో వేగంగా మాల్‌లోకి దూసుకొచ్చారు. అప్పటికే మద్యం తాగి ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు వెళ్లిపోవాలని సూచించారు.

మెడికోలను ఢీకొట్టి.. వారిపై కారెక్కించి..

  • సైకోల్లా ప్రవర్తించిన ఇద్దరు యువకులు

  • తలపైకి టైరు ఎక్కడంతో యువతి పరిస్థితి విషమం

  • 3న రాజమండ్రి ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ వద్ద ఘటన

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సెకండ్‌ షో సినిమా చూసేందుకు ఇద్దరు యువకులు కారులో వేగంగా మాల్‌లోకి దూసుకొచ్చారు. అప్పటికే మద్యం తాగి ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆ యువకులు సైకోల్లా ప్రవర్తించారు. బయటకు వెళ్లే క్రమంలో ఎదురుగా స్కూటీపై ఉన్న ఇద్దరు మెడికోలను కారుతో గుద్దించారు. అనంతరం వారిపై నుంచి కారు పోనిచ్చి పారిపోయారు. ఈ క్రమంలో మహిళా మెడికో తలపై కారు టైరు ఎక్కడంతో ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె స్నేహితుడు చేతికి, ఛాతికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలోని ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ వద్ద ఈ నెల 3న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జీఎస్‌ఎల్‌లో డెర్మటాలజీ ఫస్టియర్‌ చదువుతున్న ప్రియాంక, ఆమె స్నేహితుడు ఎం వెంకట దుర్గాసాయి ఉమేశ్‌ (రేడియాలజీ ఫస్టియర్‌) ప్రసాద్‌ ఆదిత్య మాల్‌లో స్పైడర్‌మ్యాన్‌ సినిమా ఫస్ట్‌షోకు వచ్చారు. కాగా, ఇదే మాల్‌లో శ్రీనివాస మంగాపురం సినిమా సెకండ్‌ షో చూసేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ నామవరానికి చెందిన సూరావరపు దస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్స్‌ కారులో వేగంగా దూసుకొచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అప్పటికే వారు మద్యం మత్తులో ఉండడంతో వారిని బయటకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో దస్వంత్‌, జోసెఫ్‌ వారితో గొడవపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది బయటకు వెళ్లిపోవాల్సిందేనని చెప్పడంతో వాళ్లు కారు తీసి గేటు వైపు వేగంగా దూసుకొచ్చారు. అదే సమయానికి ప్రియాంక, ఉమేశ్‌ ఫస్ట్‌ షో చూసి బయటకు వస్తున్నారు. వీరి వెనుక వచ్చిన దస్వంత్‌, జోసెఫ్‌ కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. ఎందుకిలా చేస్తున్నారని వారిని అడిగేందుకు ఉమేశ్‌ బండి ఆపాడు.


ఇది గమనించిన దస్వంత్‌, జోసెఫ్‌.. కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక, ఉమేశ్‌ రోడ్డుపై పడిపోయారు. అదే స్పీడ్‌లో ఇద్దరిపై నుంచి కారు పోనివ్వడంతో టైరు ప్రియాంక తలపై నుంచి వెళ్లింది. వారిని స్థానికులు స్వతంత్ర ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక సొంతూరు హైదరాబాద్‌ కావడంతో యువతి తల్లిదండ్రులు అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు సమాచారం. ఉమేశ్‌ ఫిర్యాదు మేరకు ప్రకాష్‌నగర్‌ పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ మేనేజర్‌ విజయ్‌ కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దస్వంత్‌, జోసెఫ్‌లపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సుభాశ్‌ గురువారం వెల్లడించారు.

నిందితులకు తగిన శిక్ష విధించాలి: ఎంపీ పురందేశ్వరి

వైద్య విద్యార్థిని ప్రియాంకపై ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించడం అత్యంత దారుణమని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి అన్నారు. వైద్య విద్యార్థిని పరిస్థితి అత్యంత విషమంగా మారడం తనను కలచి వేసిందన్నారు. ఇంతటి అమానుషంగా ప్రవర్తించిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, వారికి తగిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Aug 07 , 2026 | 05:40 AM