Share News

మూత్రం ఆగిపోవడంతో ప్రాణం మీదకు!

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:30 AM

రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపాయి. ఆదివారం ఐదుగురు పరిస్థితి సీరియ్‌సగా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మూత్రం ఆగిపోవడంతో ప్రాణం మీదకు!

  • రాజమహేంద్రిలో ‘అనూరియా’ కలకలం

  • ఇద్దరు మృతి.. ఆస్పత్రుల్లో 13 మంది

  • నలుగురి పరిస్థితి విషమం

  • కల్తీ పాలే కారణమని అనుమానాలు

రాజమహేంద్రవరం/కోరుకొండ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు కలకలం రేపాయి. ఆదివారం ఐదుగురు పరిస్థితి సీరియ్‌సగా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ పాలు తాగడం వల్ల ఇప్పటికే ఇద్దరు మృతిచెందారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాల వ్యాపారిని కోరుకొండ పోలీసులు విచారిస్తున్నారు. వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధి లోని 50వ డివిజన్‌ లాలాచెరువు చౌడేశ్వరనగర్‌లో ఈనెల 16 నుంచి మూత్రం ఆగిపోవడం, కిడ్నీ సమస్య వంటి కేసులు నమో దవుతున్నాయి. బాధితులు ఇప్పటి వరకూ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఆదివారం ఐదుగురి పరిస్థితి సీరియస్‌ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కల్తీ పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు బాధితులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట కనకలక్ష్మి(85) మృతిచెందినా అది నమోదు కాలేదు. ఆదివారం తాడి కృష్ణవేణి(65) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతిచెందింది. రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆరుగురు ఐసీయూలో ఉండగా నలుగురి పరిస్థితి సీరియ్‌సగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ కీర్తి చేకూరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.


డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి చౌడేశ్వర నగర్‌ ప్రాంతంలో సర్వే చేశారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేశ్‌ అనే పాల వ్యాపారి చాలా కాలంగా వీరందరికీ పాలు అమ్ముతున్నాడు. ఈ నెల 16న విక్రయించిన పాలు చేదుగా ఉండడం.. ఆ పాలు తీసుకున్న వారికి అస్వస్థతగా ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గణేశ్‌ను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలువురు రైతులనూ పోలీసు స్టేషన్‌కు పిలిచారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్టు చెప్పారు. మునిసిపల్‌ అధికారులు మంచినీటి పరీక్షలు నిర్వహించారు. కానీ పాలలో కూడా యూరి యా, ఇతర పిండి పదార్థాలు కలుపుతున్నార నే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు.

Updated Date - Feb 23 , 2026 | 05:31 AM