Share News

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:24 AM

ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఇక లేరు. ఆదివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

  • కిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస

  • ఈ నెల 3న మద్యం మత్తులో కారు నడిపి.. మెడికోపైకి ఎక్కించిన యువకులు

  • ఆ ఇద్దరినీ కఠినంగా శిక్షించాలి: తండ్రి

  • ప్రభుత్వం పూర్తి అండగా ఉందని, సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించారని వెల్లడి

  • నిందితులను వదలబోమన్న ఎస్పీ

  • 20 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు

  • మృతి వార్తతో కాలేజీలో విషాదఛాయలు

రాజమహేంద్రవరం/హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఇక లేరు. ఆదివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ప్రియాంకను ఈ నెల 6 తెల్లవారుజామున 2:12 గంటలకు కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. అంతకుముందు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమెకు జీసీఎస్(గ్లాస్గో కోమాస్కేల్‌) తక్కువగా ఉండటంతో ఇన్‌ట్యూబేట్‌ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అనంతరం, కిమ్స్‌లో 3 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆదివారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారు.


ఏం జరిగింది?

వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక.. తన స్నేహితుడు, మరో వైద్య విద్యార్థి వేనుతురుమల్లి వెంకట దుర్గా సాయి ఉమేశ్‌ ద్విచక్ర వాహనంపై ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఓ మాల్‌లో సినిమా చూసి బయటకు వెళ్తున్నారు. అప్పటికే రెండో ఆట సినిమా చూడడానికి మద్యం సేవించి మాల్‌ వద్దకు వచ్చిన ఇద్దరు యువకులు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో వారితో గొడవ పడ్డారు. తర్వాత నిందితులు తమ కారు(ఏపీ 40 జెఎఫ్‌ 6299)లో వేగంగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది గేటు మూయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కారును అత్యంత వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న ప్రియాంక ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ కిందపడిపోగా.. ప్రియాంకపై నుంచి కారు ఎక్కించడంతో తల, ముక్కు, చెవులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఉమేశ్‌ కూడా గాయపడ్డారు. బాధితులను వెంటనే జీఎ్‌సఎల్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రియాంకను సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ప్రియాంక ఆదివారం కన్నుమూశారు. కాగా, ప్రియాంక మృతి వార్తతో వైద్య విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక ఫొటోను పెట్టి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.


కఠిన శిక్ష పడేలా చేస్తాం: ఎస్పీ

ప్రియాంక మరణం విచారకరమని, నిందితులకు కఠిన శిక్షపడే విధంగా సాక్ష్యాధారాలతో నిరూపిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆ మేరకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ఓ మాల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జీఎ్‌సఎల్‌ మెడికల్‌ కళాశాలలో ఎండీ రేడియాలజీ మొదటిసంవత్సరం చదువుతున్న ఉమేశ్‌ ఫిర్యాదు మేరకు.. 4న మొదట ప్రమాద కేసుగా(134/2026), బీఎన్‌ఎస్ 125(బీ) సెక్షన్‌తో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. సీసీ టీవీ దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి అదే రోజున ఈ కేసులోని సెక్షన్‌ని బీఎన్‌ఎస్ 110 రెడ్‌విత్‌3(5) అంటే హత్యాయత్నానికి సమానమైన నేరం కిందకు మార్పు చేశాం. నిందితులు రాజమహేంద్రవరంలోని మోరంపూడికి చెందిన సూరవరపు దిశ్వంత్‌, లాలాచెరువుకు చెందిన దేశాభక్తుల ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్‌ పరారుకాగా, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధార సహాయంతో ఇద్దరినీ ఈ నెల 6న అరెస్టు చేసి 7న కోర్టులో ప్రవేశపెట్టాం. ఈ నెల 21 వరకూ కోర్టు రిమాండు విధించింది. నిందితులను పోలీస్‌ కస్టడీకి కోరుతూ త్వరలోనే పిటిషన్‌ వేయనున్నాం. డాక్టర్‌ ప్రియాంక మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో 106(2) రెడ్‌విత్‌ 3(5) సెక్షనుగా మార్పు చేశాం. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి త్వరితగతిన చార్జిషీటు దాఖలు చేస్తాం’’ అని ఎస్పీ వివరించారు.


ఘటనపై అనుమానాలున్నాయి: మెడికో తండ్రి

‘‘నా కుమార్తె ప్రియాంక ద్విచక్ర వాహనాన్ని మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయి.’’ అని ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశంనగర్‌ పోలీస్‌ స్టేషనుకు వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలమైన సెక్షన్లు నమోదు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసు తప్పుదోవ పడు తుందేమోనని వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చాం. కచ్చితంగా నిందితులు తప్పించుకొనే అవకాశమే లేదు. మాకున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేశారు. హోం మంత్రి అనిత, కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్సీ నరసింహ కిశోర్‌ సహకరిస్తున్నారు. ప్రియాంక కేసులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించిన తీరు సంతృప్తినిస్తోంది. మా మాటలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయి. అసలే బాధలో ఉన్న మమ్మల్ని మరింత బాధ పెట్టేలా కథనాలు ప్రసారం చేయవద్దు. దయచేసి మమ్మల్ని రాజకీయంలోకి లాగొద్దు.’’ అని చెప్పారు. ‘‘ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయాయి. మా కలల సౌధం కళ్ల ముందే కూలిపోయింది. మా కష్టమంతా ధారపోసి చదివించుకున్నాం. మా కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రియాంక కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రియాంక మరణించిందనే వార్త విన్న వెంటనే సీఎం చంద్రబాబు ఆదివారం మరోసారి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిశోర్‌తో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ప్రియాంక మృతిపై మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్‌, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

డాక్టర్‌ ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో, మద్యం మత్తులో కారుతో ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. ప్రియాంక మృతికి కారణమైనవారు ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నారు. వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నా.’’ అని ఎక్స్‌లో సీఎం పేర్కొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 03:27 AM