అనంతబాబు ప్రత్యేక సదుపాయాలు కోరింది నిజమే
ABN , Publish Date - May 03 , 2026 | 05:37 AM
డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరిన మాట వాస్తవమేనని జైలు అధికారులు అన్నారు.
రాజమండ్రి జైలు అధికారుల వివరణ
కాకినాడ, మే 2(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరిన మాట వాస్తవమేనని జైలు అధికారులు అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన ‘నేను ఎమ్మెల్సీని.. తెలుసా’ కథనంపై జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ స్పందించి ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఎమ్మెల్సీ కావడంతో ప్రత్యేక సదుపాయాలు కావాలని అనంతబాబు కోరారని అందులో పేర్కొన్నారు. సెంట్రల్ జైలు నిబంధనలు, నియమావళి, న్యాయస్థానం నుంచి వచ్చే ఆదేశాలు అనుసరించి తాము చర్యలు తీసుకుంటామని అనంతబాబుకు స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే ప్రత్యేక సదుపాయాల విషయంలో అనంతబాబు జైలు అధికారులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు లేవని వివరణ ఇచ్చారు. 2022లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు.. జైలులో పనిచేసిన సిబ్బందిలో కొందరు ఇప్పుడు ఉన్నారన్నారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఈ లేఖను మంగళగిరిలోని రాష్ట్ర జైళ్ల శాఖ అధిపతి, కోస్తాంధ్ర జైళ్ల శాఖ ఉపశాఖాధికారికి కూడా పంపించింది.