Share News

కల్తీ పాలే కాటేశాయి!

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:33 AM

స్వచ్ఛంగా ఉండాల్సిన పాలు.. కాలకూట విషంలా మారాయి..! రాజమహేంద్రవరంలో ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి..! మరో 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా..

కల్తీ పాలే కాటేశాయి!

  • రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో.. ఐదుకు చేరిన మృతులు.. నలుగురి పరిస్థితి విషమం

  • మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం

  • బాధితుల వైద్య ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది

  • సీఎం చంద్రబాబు ప్రకటన.. అధికారులపై సీరియస్‌

  • పూర్తిస్థాయి విచారణకు ఆదేశం.. పాల వ్యాపారి అరెస్టు

  • శివరాత్రికి తాగిన పాలతోనే సమస్య అనే అనుమానం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంగా ఉండాల్సిన పాలు.. కాలకూట విషంలా మారాయి..! రాజమహేంద్రవరంలో ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి..! మరో 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆక్యూట్‌ రీనాల్‌ ఫెయిల్యూర్‌తో ఐదుగురు మృతి చెందడానికి కారణం కల్తీ పాలేనని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. పరిస్థితి పట్ల సీరియస్‌ అయ్యారు. పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న వారి వైద్యఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి సీఎంకు వివరించారు. ఇప్పటికే పాల వ్యాపారిని అరెస్ట్‌ చేశామని, పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. సహాయం కోసం హెల్ప్‌లైన్‌ 9494060060 నంబరు ఏర్పాటు చేశామన్నారు. కాగా, లాలాచెరువు ప్రాంతానికే పరిమితం అనుకున్న కల్తీ పాల బాధితులు దివాన్‌చెరువులోనూ కనిపించడం మరింత ఆందోళన రేపుతోంది. ఈ ప్రాంతంలో ఈ నెల 20న కుయ్యేటి ఛాయశ్రీ (54) అనే మహిళ మృతి చెందారు. ఈ కుటుంబం కూడా సదరు పాల వ్యాపారి వద్దే పాలు పోయించుకోవడం గమనార్హం.

Untitled-5 copy.jpg


బాధితులు, పశువులకు రక్త పరీక్షలు

పాల వ్యాపారి గణేష్‌ మొత్తం 106 కుటుంబాలకు పాలు పోస్తుండగా.. సోమవారం 80 కుటుంబాల వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. గణేష్‌ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో.. పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో 46 పాడిపశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని వైజ్ఞానిక, పశుసంవర్ధక శాఖ ప్రయోగశాలకు పంపారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు తదితర ఉత్పత్తుల శాంపిల్స్‌ను హైదరాబాద్‌, విశాఖపట్నంలోని ప్రయోగశాలకు పంపారు. గణేష్‌ ఎవరెవరికి పాలు పోశాడనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దివాన్‌చెరువులోని బీజాపురికాలనీ వాసులకు కూడా పాలు పోసినట్టు గుర్తించారు. దీంతో బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాల వ్యాపారి అనధికారిక డెయిరీని కూడా పోలీసులు సీజ్‌ చేశారు.

శివరాత్రి నుంచే.. అస్వస్థత మొదలు

గణేష్‌ ఐదేళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. రైతుల నుంచి పాలు సేకరించి దివాన్‌చెరువు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో లూజు పాలు అమ్మకాలు చేస్తున్నాడు. శివరాత్రి నుంచే పాలు తేడా వచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు పాల అమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా కలిపి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. దివాన్‌చెరువులోని కుయ్యేటి ఛాయశ్రీ కూడా గత సోమవారం అస్వస్థతకు గురై మూడు ఆస్పత్రులు తిరిగి.. చివరికి ఈ నెల 20న మృతి చెందినట్టు ఆమె భర్త మురళీకృష్ణ తెలిపారు. లాలాచెరువులోని స్వరూ్‌పనగర్‌, చౌడేశ్వరనగర్‌ బాధితులు కూడా ఈనెల 16 నుంచి అంటే శివరాత్రి మరుసటి నుంచే అస్వస్థతనకు గురికావడం గమనార్హం.


రెండు రోజుల్లో ఐదుగురు మృతి!

గత రెండు రోజుల్లో మృతిచెందిన వారి వివరాలను కలెక్టర్‌ కీర్తి చేకూరి ప్రకటించారు. లాలాచెరువుకు చెందిన ఎన్‌.శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి కృష్ణవేణి (76), తాడి రమణి (58) కల్తీ పాల నేపథ్యంలో ఆక్యూట్‌ రీనాల్‌ ఫెయిల్యూర్‌ వల్ల మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దివాన్‌చెరువు బీజాపురి కాలనీలో కుయ్యేటి ఛాయశ్రీ మృతిని ఇంకా ధ్రువీకరించలేదు. కాగా, ఆరోగ్యశాఖ కమిషనర్‌, ఏలూరు రేంజ్‌ ఐజీ... ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అసెంబ్లీలో అత్యవసర చర్య కింద కల్తీ పాల బాధితుల అంశం నోటీసు ఇవ్వడంతో స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించారు. మంత్రి కందుల దుర్గేష్‌ అధికారులతో సమీక్షించారు.


  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

  • శాసన సభలో వెల్లడించిన చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కల్తీ పాలు తాగి మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అస్వస్థతతో ఆస్పత్రిపాలైన వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కల్తీ పాల ఘటనపై చంద్రబాబు సోమవారం శాసనసభలో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘రాజమండ్రిలోని చౌడేశ్వరినగర్‌, స్వరూ్‌పనగర్‌లకు చెందిన బాధితుల రక్తంలో యూరియా, సీరమ్‌ క్రియాటినిన్‌ స్థాయిలు పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని వరలక్ష్మీ మిల్క్‌ డెయిరీ ఆ ప్రాంతాల్లోని 106 కుటుంబాలకు రోజూ పాలు సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలు తాగడం వల్లే బాధితులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓ బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాలు కల్తీ చేసినట్లు విచారణలో నిర్ధారణ అయితే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం హెచ్చరించారు. అంతకుముందు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాజమండ్రిలో జరిగిన విషాద ఘటనపై ప్రభుత్వం తనంతట తానే ముందుకొచ్చి సభలో ప్రకటన చేయడం అభినందనీయమని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల వెంటనే స్పందించి.. ఈ అంశంపై శాసనసభలో చర్చించాలని నోటీసు ఇచ్చారు’ అని స్పీకర్‌ వివరించారు.

Updated Date - Feb 24 , 2026 | 03:36 AM