రేపటి నుంచి ‘రైతన్నా.. మీకోసం’!
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:15 AM
ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి పది రోజులపాటు ప్రభుత్వం ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 25న జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
ప్రకృతి వ్యవసాయంపై ప్రచారం
25న ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి పది రోజులపాటు ప్రభుత్వం ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 25న జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. వ్యవసాయాభివృద్ధికి ఊతమిచ్చే పంచసూత్రాలతోపాటు అగ్రిటెక్, డీప్‌టెక్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు అంచనా ప్రకారం ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సూచనలు ఇవ్వనున్నారు. రైతుసేవా కేంద్రం పరిధిలోని వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది సహకార, నీటి సంఘాల సభ్యులతో కలిసి నిర్ధిష్ట కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. వర్షాభావం, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో నేల, నీరును సంరక్షించే వివిధ ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం అమలుపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ శనివారం సమీక్ష జరిపారు. వ్యవసాయ రంగంపై గల్ఫ్ యుద్ధ ప్రభావం, ఎల్‌నినో ఏర్పడనున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ప్రతికూల అంశాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు, రైతులను అప్రమత్తం చేయడానికి ‘రైతన్నా.. మీ కోసం’ వేదికగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తొలకరికి ముందు వేసవి చినుకులను సద్వినియోగం చేసుకుని, 32రకాల విత్తనాలతో పశుగ్రాసాల సాగు, భూమిలో సేంద్రియ నిల్వలు పెంచి, తేమతో కూడిన పోషకాలు నిల్వ చేయడం, వర్షాకాలానికి ముందు సాగు చేయదగిన పంటలు వేయడం వంటి చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ విజయకుమార్ మాట్లాడుతూ ఎల్‌నినోని సవాల్‌గా తీసుకుని, ప్రకృతి సేద్య విధానాల అమలుతో వ్యవసాయానికి, రైతులకు దన్నుగా నిలవాలని సిబ్బందికి సూచించారు. ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.