Share News

వర్షపు నీటి సంరక్షణలో భేష్‌..!

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:39 AM

ప్రజల భాగస్వామ్యంతో వర్షపు నీటి సంరక్షణ సాధ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలు నిరూపించాయి.

వర్షపు నీటి సంరక్షణలో భేష్‌..!

  • ప్రకాశంలోని మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలకు జాతీయ స్థాయి గుర్తింపు

  • కేంద్ర జలశక్తి శాఖ నుంచి ప్రశంసలు

పీసీపల్లి/ కనిగిరి/ కొండపి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతో వర్షపు నీటి సంరక్షణ సాధ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలు నిరూపించాయి. ఈ గ్రామాలు భూగర్భ జల మట్టాన్ని పెంచే చర్యలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారీ’ (జేఎస్జేబీ) కార్యక్రమాన్ని ఈ గ్రామాల ప్రజలు సమర్థవంతంగా అమలు చేశారు. నీటికుంటలు, చెక్‌డ్యాంలు విరివిగా ఏర్పాటు చేసి భూగర్భ జలమట్టాన్ని పెంచారు. దీంతో జాతీయ జల అవార్డులు-2024లో దేశంలోనే రెండో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మురుగుమ్మి గ్రామం దక్కించుకుంది. టాప్‌-30 గ్రామాల్లో ఒకటిగా మారెళ్ల గ్రామం ఎంపికైంది. జాతీయ స్థాయి గుర్తింపు కోసం తంగెళ్ల గ్రామం నామినేట్‌ అయింది. ఈ మేరకు డ్వామా అధికారులకు గురువారం కేంద్రం నుంచి లేఖలు అందాయి. ఈ సందర్భంగా డ్వామా పీడీ జోసెఫ్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ఈ గ్రామాల్లోని వేలాది మందికి తాగునీరు, సాగునీరు అందుబాటులోకి రావడం, భూగర్భ జలాలు పెరగడం సంతోషకరమని అన్నారు.

సంకల్పంతో ముందడుగు

ఉమ్మడి ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని మురుగమ్మి, మారెళ్ల.. మర్రిపూడి మండలంలోని తంగెళ్ల గ్రామాల్లో దశాబ్దాలుగా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. తీవ్ర నీటి కొరతతో ఆయా గ్రామాల్లో ప్రజలు కుటుంబాలతో సహా వలస వెళ్లేవారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి భూగర్భ జలాల పరిస్థితిపై అధ్యయనం చేశాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేస్తే ఈ ప్రాంతాల్లో నీటి కొరత తీరుతుందని గుర్తించాయి. ఇదే విషయాన్ని వివిధ కార్యక్రమాలు, కళాజాతల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం నింపాయి. దీంతో రైతులు మహిళలు, యువత కలసి నీటి ఆదాపై దృష్టి సారించారు. వ్యవసాయ కుంటలు, కాలువలు, చెరువుల పునరుద్ధరణ వంటి చర్యలు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేశారు. దీంతో వ్యవసాయ ఉత్పాదకతతోపాటు పాలఉత్పత్తి కూడా పెరిగి అదనపు ఆదాయం సమకూరింది. ఇటీవల ఈ గ్రామాల్లో వలసలు తగ్గుముఖం పట్టాయి.


వర్షపు నీటి సంరక్షణతో విప్లవాత్మక మార్పులు

  • మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలపై కేంద్రం ప్రశంసలు

ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ ద్వారా ప్రకాశం జిల్లాలోని గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కేంద్ర జల మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘జల్‌ సంచయ్‌ జన్‌ భగీదారీ’ ప్రచారంలో భాగంగా చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలోని మురుగమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించింది. నీటి సంరక్షణ వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగటమే కాక.. ప్రజల జీవనోపాధి మెరుగుపడి, వలసలు తగ్గిపోయాయని తెలిపింది. ఇంకుడు గుంటలు, వ్యవసాయ చెరువులు, విడతల వారీగా కందకాల ఏర్పాటు, ఇంటి పైకప్పులపై వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, చెరువుల పునరుద్ధరణ వంటి కీలక చర్యలు చేపట్టడంతో భూగర్భ జలాల మట్టం పెరిగిందని వెల్లడించింది.

Updated Date - Apr 10 , 2026 | 03:39 AM