జోన్ గెజిట్‌పై అభినందించే మనసు కూడా లేదు
ABN , Publish Date - May 07 , 2026 | 04:04 AM
ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న రైల్వే జోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ వస్తే దానిని అభినందించే మంచి మనసు కూడా వైసీపీ....
వైసీపీ, వామపక్షాలపై మాధవ్ మండిపాటు
విశాఖపట్నం, మే 6(ఆంధ్రజ్యోతి): ‘ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న రైల్వే జోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ వస్తే దానిని అభినందించే మంచి మనసు కూడా వైసీపీ, వామపక్షాలకు లేదు. తిరిగి విమర్శలు గుప్పిస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తప్పుబట్టారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కంటే కొత్త జోన్ ఇవ్వడం కష్టమని నాటి ఢిల్లీ పెద్దలు చెప్పేవారు. రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పరిశీలించాలనే ఉంది. తప్పనిసరిగా ఇవ్వాలని లేదు. అది నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పిదం. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నపుడు రైల్వే జోన్ కోసం ఎక్కువ కృషి చేశారు. అరకులోయ తరువాత ప్రాంతమంతా ఒడిశాలో ఉంది. అందుకే వాటిని రాయగడ డివిజన్‌లో చేర్చారు. పశ్చిమ బెంగాల్‌లో గత 50 ఏళ్లలో హింస లేకుండా జరిగిన ఎన్నికలు ఇవే. శ్యామాప్రసాద్ ముఖర్జీ కల నేడు నిజమైంది. తమిళనాడులో టీవీకే విజయాన్ని స్వాగతిస్తున్నాం’ అని మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కూడా పాల్గొన్నారు.