పగలు విధులు.. రాత్రి చోరీలు..
ABN , Publish Date - May 21 , 2026 | 04:10 AM
అతను రైల్వేలో జూనియర్ ఇంజనీర్. పగలు విధులు నిర్వహిస్తూ.. రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతుంటారు. కొల్లగొట్టిన సొత్తుతో జల్సాలు చేస్తుంటాడు.
దొంగ అవతారమెత్తిన రైల్వే ఇంజనీర్
గుట్టురట్టు చేసిన రైల్వే పోలీసులు.. రూ.50 లక్షల సొత్తు రికవరీ
కర్నూలు క్రైం, మే 20 (ఆంధ్రజ్యోతి): అతను రైల్వేలో జూనియర్ ఇంజనీర్. పగలు విధులు నిర్వహిస్తూ.. రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతుంటారు. కొల్లగొట్టిన సొత్తుతో జల్సాలు చేస్తుంటాడు. రైల్వే పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ రైల్వే ఉద్యోగి బాలరాజు గుట్టు రట్టయింది. ఓ బ్యాగ్ చోరీ కేసులో బాలరాజును అరెస్టు చేసిన రైల్వే పోలీసులు అతడి నుంచి రూ.50 లక్షలు విలువైన సొత్తును రికవరీ చేశారు. రైల్వే డీఎస్పీ శ్రీనివాసాచారి, కర్నూలు రైల్వే సీఐ శ్రీనాథరెడ్డి, డోన్ రైల్వే ఎస్‌ఐ బిందు మాధవి బుధవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా యాడికి నారాయణస్వామి కాలనీ చెందిన బాలరాజు 2024లో కర్నూలు జిల్లా ఆదోనిలోని రైల్వేక్వార్టర్స్‌లో నివాసముంటూ విధులు నిర్వహిస్తుండేవాడు. రైల్వేలో తనకున్న ఉచిత పాస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని రాత్రివేళలో తిరుగుతూ ప్రయాణికుల వద్ద నుంచి బ్యాగులు, ల్యాప్‌ట్యా్‌పలు ఇతర ఖరీదైన వస్తువులు చోరీ చేస్తూంటాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తన విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఓ వ్యక్తి కర్నూలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శ్రీనాథ్ రెడ్డి, ఎస్‌ఐ బిందుమాధవి కుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఓ వ్యక్తి విలువైన బ్యాగ్ పట్టుకుని రైలు దిగిపోతుండటాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరా అని దర్యాప్తు చేపట్టగా.. బాలరాజే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేసి 20 తులాల బంగారం, రూ.20వేలు నగదు, 13 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్‌ట్యా్‌పలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.