ఎవరి ఆదేశాలతో రఘురామను అరెస్టు చేశారు?
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:20 AM
‘ఎవరి ఆదేశాలతో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు? ఎవరు టార్చర్ పెట్టమన్నారు? అసలు రఘురామపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు? వారేమైనా రాతపూర్వకంగా రాసిచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా..
రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు?
గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 400 కి.మీ. కారులో ఎలా తీసుకొచ్చారు?
ఆయన వ్యాఖ్యలను అన్ని చానల్స్ ప్రసారం చేసినా ‘ఏబీఏన్-ఆంధ్రజ్యోతి’పైనే కేసు పెట్టడం కుట్ర కాదా?.. ఐపీఎస్ సునీల్‌నాయక్‌పై ఎస్పీ దామోదర్ ప్రశ్నల వర్షం
సమాధానాలు చెప్పకుండా నీళ్లు నమిలిన వైనం.. విజయనగరంలో విచారణ
విజయనగరం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ‘ఎవరి ఆదేశాలతో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారు? ఎవరు టార్చర్ పెట్టమన్నారు? అసలు రఘురామపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు? వారేమైనా రాతపూర్వకంగా రాసిచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా.. మార్ఫింగా అనేది పరిశీలించారా? అన్నీ సమగ్రంగా పరిశీలించకుండా కేసు పెట్టడం.. హైదరాబాద్ వెళ్లి ఆయన్ను అరెస్టు చేయడం చట్టపరిధి దాటినట్లు కాదా? ఎటువంటి ప్రతిఫలం ఆశించి రూల్స్‌కు వ్యతిరేకంగా కేసులు పెట్టారు?’ అని నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్‌కు విచారణ అధికారి దామోదర్ ప్రశ్నలు సంధించారు. సునీల్ నాయక్ విచారణకు సహకరించలేదని తెలిసింది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఈ కేసు విచారణ విజయనగరంలో ఆదివారం కూడా కొనసాగింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ-7 సునీల్ నాయక్‌ను మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో విచారించారు. విచారణ అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ లోతుగా ఆరా తీశారు. బిహార్ క్యాడర్‌కు చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీ విభాగంలో విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే రఘురామ అరెస్టు జరిగింది. కస్టడీలో సునీల్ నాయక్ అతిగా వ్యవహరించారన్న అభియోగాలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ దామోదర్ కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ‘అరెస్ట్ చేసే సమయానికి రఘురామకృష్ణరాజుకు గుండె ఆపరేషన్ అయ్యి చాలా తక్కువ రోజులైంది. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని సుమారు 400 కిలోమీటర్ల దూరం కారులో ఎలా తీసుకొస్తారు? అంతదూరం కారులో తీసుకురమ్మని మీకు ఎవరు చెప్పారు? మీరే కొంతమంది పెద్దల మెప్పు పొందాలని అలా చేశారా? ఇది కుట్ర కాదా? అని సునీల్ నాయక్‌ను ప్రశ్నించారు. విచారణలో ఆయన నీళ్లు నమిలినట్టు తెలిసింది. ‘రఘురామ కులమతాలను రెచ్చగొట్టేలా సీఎం, ప్రభుత్వంపై విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వాటిని ప్రసారం చేసిన ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’పై కేసులు పెట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ఆ వార్తలను అన్ని చానల్స్, పత్రికలు కవర్ చేశాయి. కానీ ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’పై ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? ఇది కుట్రలో భాగం కాదా?’ అని దామోదర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాయక్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. సీఐడీ ఏఎస్పీగా ఉంటూ రిటైర్డ్ అయిన విజయపాల్ శనివారం విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు డీఐజీ హోదాలో ఉన్న సునీల్‌నాయక్ ఆదేశాలతోనే రఘురామను అరెస్టు చేశానని విజయపాల్ విచారణలో తెలిపారు. ఇదే విషయాన్ని సునీల్ నాయక్‌ను ఎస్పీ దామోదర్ అడిగినట్టు తెలుస్తోంది. నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారా? ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు? అని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో సాక్షిగా బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.