జడ శ్రవణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోరా?
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:15 AM
డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌పైనా బహిరంగంగా సభ్య సమాజం తలదించుకునేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జడ శ్రవణ్‌కుమార్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం..
దారుణ వ్యాఖ్యలు చేస్తే బెయిల్ ఇచ్చి పంపిస్తారా: రఘురామకృష్ణరాజు
కాళ్ళ, జూలై 4(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌పైనా బహిరంగంగా సభ్య సమాజం తలదించుకునేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జడ శ్రవణ్‌కుమార్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తమిళనాడులో సీఎంపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. అయితే మన రాష్ట్రంలో బహిరంగంగా కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాజీ మేజిస్ట్రేట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ.. అతనిపై ఏ విధమైన చర్యలూ లేవన్నారు. న్యాయవ్యవస్థ తమిళనాడులో ఒకలా... ఏపీలో మరోలా ఉంటుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘శ్రవణ్‌కుమార్ పిటిషన్‌పై మన ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగా వాదించలేకపోయారో ఏమో తెలియదు గానీ, ఆ కేసును నాలుగు వారాలు వాయిదా వేసిన కోర్టు.. శ్రవణ్‌కుమార్‌పై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని తెలియజేయడం హాస్యాస్పదంగా ఉంది’ అని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వం, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లడానికి ‘తెలుగు వీర లేవరా’ అనే సంస్థ స్థాపించానని, ఇదే సంస్థ ద్వారా ‘నాకు న్యాయం చేయండి..’ అని అడగాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు.