అనుకున్న సమయానికి రామాలయం పూర్తి: రఘురామ
ABN , Publish Date - May 20 , 2026 | 05:50 AM
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయం నిర్మాణాన్ని అన్ని అనుమతులతోనే ప్రారంభించామని అనుకున్న సమయానికి ఆలయం పూర్తి చేస్తామని..
కాళ్ల, మే 19 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయం నిర్మాణాన్ని అన్ని అనుమతులతోనే ప్రారంభించామని అనుకున్న సమయానికి ఆలయం పూర్తి చేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణంపై సుప్రీం కోర్టు స్టే విధించిందని అయితే సీనియర్ న్యాయవాదులను నియమించి త్వరితగతిన పనులు చేయడానికి అనుమతి తీసుకొస్తామని చెప్పారు. ‘‘ఏదో అయిపోయిందనుకుని కొన్ని క్రైస్తవ సంఘాలు నృత్యాలు చేసుకున్నారని తెలిసింది. వాళ్లు త్వరలోనే బిగ్గరగా ఏడ్చే సీన్ ఎంతో దూరంలో లేదు.. కోర్టు తీర్పు వచ్చేవరకూ అక్కడ ఏ పనీ జరగదని అయితే రామాలయం నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుంది’’ అని అన్నారు. పబ్లిక్ స్థలాల్లో అనుమతి లేకుండా కట్టిన చర్చిలు కోకొల్లలుగా ఉన్నాయని రానున్న రెండు నెలల్లో తన దృష్టి వాటిపైనే ఉంటుందని చెప్పారు.‘‘క్రైస్తవ సోదరులకు నచ్చనది నేను.. నాకు ఓటెయ్యడం మానేయండి.. మీ పోరాటానికి నేను అడ్డంగా ఉండను. రాజ్యాంగంలో మీరు కోరుకుంటున్న మార్పు రావాలని కోరుకుంటున్నాను. అదొచ్చేవరకూ నేను మిమ్మల్ని ఓటు అడగను.. జీస్‌సపై ప్రామిస్ చేసి చెబుతున్నా’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.